స్వతంత్ర వెబ్ డెస్క్: కేరళలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. మటన్ కూర తక్కువైందని అధికారినే కొట్టాడు ఒక ఖైదీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన వయనాడ్ కు చెందిన ఫైజాస్ పూజపురా అనే ఖైదీ సెంట్రల్ జైలులో అత్యంత భద్రతతో కూడిన సెల్ లో ఉన్నాడు. ఈ క్రమంలో తనకు వడ్డించిన మటన్ కూరతో సహా అతనికి అందించిన ఆహరం పరిమాణం తక్కువగా ఉందని జైలు అధికారులపై అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే కాదు దాడికి సైతం దిగాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రస్తుత అతడిపై కేసు నమోదు చేశారు. అందరు ఖైదీల కన్నా తనకు ఎక్కువ మటన్ కావాలని కోరుతూ ఫైజాస్ దాడికి పాల్పడినట్లు సీనియర్ జైలు అధికారి తెలిపారు.
సాధారణంగా వారంలో ఒక రోజు ఖైదీలకు మటన్ కూర వడ్డిస్తామని, మామూలుగా ఇచ్చే పరిమాణం కన్నా ఎక్కువగా కావాలని అడిగాడు, ఈ వివాదంతో గొడవను ప్రారంభించాడు, వడ్డించిన మటన్ కర్రీని చెత్తబుట్టలో పారేశాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు పాల్పడిన ఖైదీ ఇతర జైళ్లలో కూడా ఇలాగే చేసేవాడని, ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డుకు తరలించినట్లు తెలిపారు.