భారత సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ ప్రభుత్వం 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి ఫలకాలను భారత్‌కు అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా శనివారం ఈ బదిలీ కార్యక్రమం జరిగింది.
యూరప్‌లో ‘లైడెన్ ప్లేట్స్’గా ప్రసిద్ధి చెందిన ఈ రాగి ఫలకాలు చోళ సామ్రాజ్యానికి చెందిన అత్యంత విలువైన చారిత్రక ఆధారాల్లో ఒకటిగా గుర్తించబడ్డాయి. 2012 నుంచి భారత్ వీటి తిరిగి అప్పగింత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
యూఏఈ పర్యటన అనంతరం నెదర్లాండ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “11వ శతాబ్దానికి చెందిన చోళ రాగి ఫలకాలు భారత్‌కు తిరిగి రావడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన విషయం” అని పేర్కొన్నారు.

ఈ రాగి ఫలకాలు రాజరాజ చోళుడు ప్రథముని పాలన కాలానికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. మొత్తం 21 రాగి ఫలకాలు కలిగిన ఈ సేకరణ దాదాపు 30 కిలోల బరువుతో ఉండగా, చోళ రాజ ముద్రతో కూడిన కంచు ఉంగరంతో బిగించి ఉంచారు. ఇందులోని శాసనాలు సంస్కృతం, తమిళ భాషల్లో ఉన్నాయి.
నాగపట్టణంలో బౌద్ధ విహారానికి ఇచ్చిన విరాళాల వివరాలు ఈ శాసనాల్లో ఉన్నాయి. దక్షిణ భారతదేశం , ఆగ్నేయాసియా మధ్య సముద్ర వాణిజ్య సంబంధాలు, మత సామరస్యాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
చరిత్రకారుల ప్రకారం, మొదట రాజరాజ చోళుడు మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలను తాళపత్రాలపై లిఖించారు. అనంతరం ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు వాటిని శాశ్వతంగా నిలిచేలా రాగి ఫలకాలపై చెక్కించినట్లు భావిస్తున్నారు.
18వ శతాబ్దంలో నాగపట్టణం డచ్ పాలనలో ఉన్న సమయంలో క్రైస్తవ మిషనరీతో అనుబంధం ఉన్న ఫ్లోరెంటియస్ క్యాంపర్ ఈ ఫలకాలను నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇవి అక్కడి భద్రతా కేంద్రాల్లో భద్రపరిచబడ్డాయి.
ఈ ఫలకాల తిరిగి అప్పగింతకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభించగా, భారతదేశమే వాటి అసలు యజమాని దేశమని గుర్తిస్తూ చర్చలు కొనసాగించాలంటూ అంతర్ ప్రభుత్వ కమిటీ సూచించింది. చివరకు ప్రధాని మోదీ అధికారిక పర్యటన సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం వాటిని భారత్‌కు అప్పగించింది.


