గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.7 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. పరిస్థితులు కాస్త శాంతించడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినా.. గోదావరి వరద ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికే 12న్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల చేస్తుండడంతో కోనసీమలోని నాలుగు లంక గ్రామాలు నీటిలోనే నానుతున్నాయి.
భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉగ్రరూపం కొంత మేర తగ్గింది. నీటి మట్టం 42.9 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం, పేరూరులో వరద నిదానంగా పెరుగుతోంది. ఈ ప్రభావం కాస్తా భద్రాచలంపై పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో గోదావరి వరద తగ్గినప్పటికీ లోతట్టు ప్రాంతమైన కొత్త కాలనీ ముంపు నుంచి ఇంకా బయటపడలేదు. పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు అధికారులు భోజన సదుపాయాలు కల్పించారు.


