తెలంగాణ(Telangana)లో రాబోయే మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ( India Meteorological Department) హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ (B. Ravinder Nayak) విడుదల చేసిన ప్రకటనలో వడదెబ్బ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
నీరు తాగాలి
శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ నీరు తాగాలని, దాహం వేయకపోయినా ద్రవ పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఓఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంది. ప్రయాణాలకు వెళ్లేవారు తప్పనిసరిగా వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలని సూచించారు.
అలాగే పుచ్చకాయ, కర్బూజ, దోసకాయ, నారింజ, ద్రాక్ష వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు పలుచని, లేత రంగు కాటన్ దుస్తులు ధరించి, తలకు టోపీ లేదా టవల్ కప్పుకోవాలని తెలిపారు. చెప్పులు లేకుండా బయట తిరగవద్దని హెచ్చరించారు.
ఇవి చేయకూడదు
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని, శ్రమతో కూడిన పనులు చేయవద్దని స్పష్టం చేశారు. అలాగే ఆల్కహాల్, టీ, కాఫీ, గ్యాస్ పానీయాలు, అధిక చక్కెర ఉన్న డ్రింక్స్ తీసుకోవద్దని సూచించారు. మసాలా, నూనె ఎక్కువగా ఉండే ఆహారం, నిల్వ ఉంచిన ఆహారం కూడా ఆరోగ్యానికి హానికరమని తెలిపారు.
వడదెబ్బ లక్షణాలపై కూడా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. తీవ్రమైన తలనొప్పి, శరీరం వేడెక్కడం, వాంతులు, కళ్లు తిరగడం, శ్వాస వేగంగా మారడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం పొందాలని సూచించారు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగితే అది ప్రమాదకర పరిస్థితిగా పరిగణించాలని తెలిపారు.
ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, మందులు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. అలాగే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


