28.1 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముళ్లు వీడేనా ?

  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈనెల ఆరోతేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం జరగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటికి పదేళ్లు దాటింది. విభజన జరిగి పదేళ్లు అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని పరిష్కారం కాని సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అయితే ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల ముఖాముఖి భేటీ ఖరారైనట్లే. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. స్థూలంగా విభజన సమస్యల పరిష్కారమే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ప్రధాన అజెండాగా భావించవచ్చు.

  2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. విభజన తరువాత తెలంగాణలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే విభజన తరువాత 2014 లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.

  2014 తరువాత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవించాయి. ఇక్కడో విశేషం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే అధికారానికి వచ్చాయి. తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పవర్‌లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. సుదీర్ఘకాలం ఆయనకు తెలుగుదేశం పార్టీతో కేసీఆర్ కు అనుబంధం ఉంది. చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో కేసీఆర్ మంత్రిగా పనిచేశారు. అయితే ఒకదశలో డిప్యూటీ స్పీకర్ పదవికి అలాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జనంలోకెళ్లారు. తెలంగాణ కోసం ఉద్యమించారు. దాదాపు పథ్నాలుగు సంవత్సరాల తరువాత 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించారు.

  ఇక చంద్రబాబు నాయుడు విషయానికొస్తే ఆయన 1978 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1978 ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత టంగుటూరి అంజయ్య క్యాబినెట్‌లో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాతికాలంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1995 లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేసీఆర్ గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో పనిచేసినప్పటికీ, 2014 తరువాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత లేదు. దీనికి కారణం అప్పట్లో రెండు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులే.

  ఆ తరువాత 2019 లో రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2019 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి అధికారానికి వచ్చింది. కేసీఆర్ వరుసగా రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తొలిసారి అధికారం లోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికల తరువాత రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాల్లో కొట్టొచ్చినట్లు మార్పులు కనిపించాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మధ్య సఖ్యత పెరిగింది. విభజన హామీలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక అవగాహనతో అడుగులు వేశారు. వయస్సు రీత్యా కేసీఆర్ పెద్ద వారు కావడంతో, ఆయన పట్ట జగన్మోహన్ రెడ్డి గౌరవంగా ప్రవర్తించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పిన్న వయస్కుడు కావడంతో ఆయన పట్ల కేసీఆర్ వాత్సల్యంతో ప్రవర్తించారు. కాగా ఇటీవల జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పెనుమార్పులు సంభవించాయి. 2023 నవంబరులో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు, విభజన తరువాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిది గురుశిష్య సంబంధం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరగనున్న ముఖాముఖి సమావేశం ప్రాధాన్యం సంతరించు కుంది. కాగా ముఖ్యమంత్రుల హోదాలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కాబోవడం ఇదే తొలిసారి. చంద్రబాబు, రేవంత్ మధ్య జరగనున్న సమావేశాన్ని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం స్వాగతించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖాముఖి చర్చలు జరపడం వల్ల పెండింగ్‌లో ఉన్న అనేక విభజన హామీలకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావాన్ని ప్రొఫెసర్ కోదండరాం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విభజన సమస్యల పరిష్కారానికి అసలు అడుగులు పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కేసీఆర్ వైఖరి వల్ల విభజన సమస్యలు మరింత జఠిలమయ్యాయని కోదండరాం ఆరోపించారు. కాగా గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం మాట్లాడుకున్నారే కానీ, విభజన సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపలేదని మండిపడ్డారు ప్రొఫెసర్ కోదండరాం.

ఇదిలా ఉంటే ఈనెల ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం విలీన గ్రామ పంచాయితీల అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాలను మళ్లీ భద్రాచలంలో కలపాలని తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్ అయింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్