కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమావేశం రసాబాసగా మారింది. ఎమ్మెల్యేలు సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే సంజయ్ దగ్గరికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లారు. నువ్వు ఏ పార్టీ అంటూ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రభుత్వ పథకాలపై సమీక్ష సమావేశంలో ఈ వాగ్వాదం జరిగింది. నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావ్ అంటూ పాడి కౌశిక్ రెడ్డి.. తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతున్న సంజయ్ ని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచావంటూ ఫైర్ అయ్యారు.
పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ పరస్పరం తోసుకున్నారు. చేయికూడా చేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. పరుష పదజాలంతో సంజయ్ పై దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారు పాడిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు.
ఈ సందర్బంగా పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల గురించి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో 50 శాతం ప్రజలకు రుణమాఫీ రాలేదని.. అడిగితే దౌర్జన్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అర్హత లేని వారికి కూడా మైకులు ఇచ్చి మాట్లాడిస్తున్నారని మండిపడ్దారు.