పాకిస్థాన్ సింధు నది లోయలో భారీగా బంగారు నిల్వలు వెలుగు చూశాయి. పాక్ పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలోని సింధూ లోయలో సుమారు 32.6 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని గుర్తించారు. దీని విలువ 600 బిలియన్ పాకిస్థానీ రూపాయలుగా ఉంటుందని అంచనా వేశారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ బంగారం విలువ 18 వేల కోట్ల రూపాయలు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ ఈ వివరాలను ధృవీకరించింది. పలు కారణాల వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్షంగా మారింది. ఈ సువర్ణం వెలికితీత ప్రక్రియ మొదలవుతే పాక్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడవచ్చు. దీంతో, దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునే అవకాశం, పాక్ కరెన్సీ కొంతమేర బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
అటోక్ జిల్లాలోని సింధు నది లోయలో బంగారు నిల్వలు వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పాక్ పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ తెలిపారు. నదీ లోయ ప్రాంతంలో సుమారు 32 కిలోమీటర్ల పరిధిలో బంగారు నిల్వలు విస్తరించి ఉన్నట్టు తెలుస్తోందని ఆయన చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సైతం బంగారు నిల్వలు ఉన్నట్టు తెలిందని ఆయన చెప్పారు. పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ లలోనూ బంగారు నిల్వలు ఉన్నాయని, ఇక పాక్ కు మంచి రోజులు వచ్చినట్టేనని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పై నిషేధం ఉందని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు.
హిమగిరి శిఖరాల్లో జన్మించిన సింధు నది పాక్ మీదుగా ప్రవహించి అరేబియా మహా సముద్రంలో కలుస్తుంది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు అధికంగా ఉంటాయని, ఈ చర్యల వల్ల అక్కడ బంగారు అణువులు ఏర్పడుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శతాబ్దాల తరబడి నిరంతరాయంగా సింధూ నది ప్రవాహం సాగుతున్న ఫలితంగా, బంగారు అణువులు నదీలోయలో పలుచోట్ల పేరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.