అనగనగా ఒక ఊళ్లో.. అంటూ మొదలయ్యే ఏ కథలోనైనా సాధారణంగా వినిపించే మాట అటవీ ప్రాంతం. చల్ల గాలులు, పిల్ల గాలులు, సెలయేర్లు, జలపాతాలు అంతా హరిత శోభ..ఈ ఆహ్లాదకర వాతావరణంలో విహారం చేస్తూ క్రూర మృగాలు, సాధు జీవాలను తిలకించే యోగ్యం కలిగితే.. పర్యాటకులు ఎంతలా పరవశించిపోతారో ప్రత్యేకించి చెప్పేముంది. ఇక చందమామ కథల్లో అటవీ ప్రాంతాల్లో కనిపించేది పాడబడిన గుడి. నవీన యుగంలో అటవీ ప్రాంత సమీపాల్లో నూతన రీతిలో ఎన్నో ఆలయాలు దర్శనమిస్తున్నాయి. అటు అటవీ ప్రాంత అందాలు, ఇటు ఆధ్యాత్మిక సొబగులతో పర్యాటక యాత్ర సాగితే… ఆ యాత్ర ఎంతో మధురానుభూతి కల్గిస్తుంది కదా..! ఈ అవకాశం మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అటవీ ప్రాంతం కలగజేయనుంది.
అడవి అంటే ఆదిలాబాద్, ఆదిలాబాద్ అంటే అడవి.. ఇది జగద్వితమైన మాట. నగరీకరణ, పట్టణీకరణ, ఆధునిక పోకడలు ఎన్ని వచ్చినా ప్రాచీన అటవీ వైభవాన్ని చెక్కు చెదరకుండా నిలబెట్టుకుంటున్న ఆనందారణ్య ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడి కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని టూరిజం ప్రత్యేక కారిడార్ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర సర్కారు నడుం బిగించింది.
ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజం అభివృద్ధిపైనా సర్కారు దృష్టి సారించింది. కవ్వాల్ అభయారణ్యం, జలపాతాలు, ప్రాజెక్ట్ ల సందర్శనతో పాటు బాసర, కదిలి, బూరుగుపల్లి తదితర ఆలయాల సందర్శనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టూరిజం ప్రత్యేక కారిడార్ గా కవ్వాల్ అభయారణ్యాన్ని అభివృద్ది చేయడానికి సర్కారు కంకణం కట్టుకోవడంతో పర్యాటకులు ఆనంద సాగరంలో తేలియాడుతున్నారు.
కండెం బ్యాక్ వాటర్ లో గంగాపూర్, లక్ష్మీపూర్ అటవీ ప్రాంతాలు తిలకించేందుకు ప్రత్యేకంగా సఫారీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాలతో పాటు ఎక్బాల్ పూర్, ఉడుంపూర్, కల్వకుంట్ల ప్రాంతాలను పర్యాటక పరిధిలోకి చేర్చినట్టు తెలిసింది. మహారాష్ట్ర తడోబా రీతిలో కవ్వాల్ టైగర్ జోన్ ను టూరిజం కారిడార్ గా తీర్చిదిద్దాలని సర్కారు ఆలోచనలు సాగిస్తోంది.
కడెం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతంలో సందర్శకులు పర్యటించడానికి వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సఫారీ వాహనాలు సాఫీగా తిరగడానికి వీలుగా అధ్వాన్న రోడ్లను చక్కని రోడ్లగా మారుస్తున్నారు. టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ పేరిట ఏకో టూరిజం కోసం ఈ యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ పీపీపీ పద్దతిలో టూరిజం స్పాట్ నిర్వహణ చేపట్టనున్నట్టు తెలిసింది. అయితే, స్పెషల్ చెక్ పోస్టులు అటవీశాఖ ఎంట్రీ ఫీజును వసూలు చేస్తుంది.
నిర్మల్, మంచిర్యాల జిల్లాల పరిధిలో వేల హెక్టార్లలో కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉంది. అయితే, కోర్, బఫర్ ఏరియాలో 20 శాతం మాత్రమే టూరిజం స్పాట్ ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. పర్యావరణహిత పర్యాటకానికి పెద్ద పీట వేయాలని సర్కారు రెడీ అయ్యింది. అడవి ప్రాంతంలో సందర్శనకు అనుకూలమైన ప్రదేశాలకు సంబంధించి ప్రత్యేక రూట్ మ్యాప్ ను అధికారులు సిద్దం చేశారు.
ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, వన్య ప్రాణుల వీక్షణ అనంతరం టెంపుల్ టూరిజానికి సర్కారు పెద్ద పీట వేసింది. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంతో పాటు, కదిలి పాపహరేశ్వర ఆలయం, బూరుగుపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయం, ఆదిలాబాద్ సూర్యదేవాలయం, మరికొన్ని ఆలయాలతో టెంపుల్ టూరిజం కారిడార్ గా తీర్చిదిద్దడానికి సర్కారు ప్రయత్నాలు సాగిస్తోంది. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంతో ఇది ఉభయతారకంగా ఉంటుందని పర్యాటక ప్రేమికులు ఉబ్బితబ్బిబవుతున్నారు.