తెలంగాణలో కాంగ్రెస్ కేడర్ దారి తప్పుతోందా?..అధికారంలో ఉన్నాం కాబట్టి తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాలో కాంగ్రెస్ క్యాడర్ ఉందా..?..కింది స్థాయి నేతలు చేసే పనులను పట్టించుకొనేవాళ్లే లేరా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల కాంగ్రెస్ క్యాడర్ వరుసగా పరాయి పార్టీ కార్యాలయాలపై దాడికి పాల్పడటం చూస్తుంటే ఆ పార్టీ క్యాడర్ దారి తప్పుతోందనే అభిప్రాయం నిజమనే అనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా పై స్థాయి నేతలు స్పందించకపోవడంతో ఈ క్యాడర్ మరింతగా రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ కేడర్ కట్టుతప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. తాజాగా భువనగిరిలోని బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసు పైన కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అధికారపార్టీ .. ఇతర పార్టీల కార్యాలయాలపై దాడి చేయడం చిన్న విషయం కాదు. రాజకీయ కారణాలతో దాడులు చేయడాన్ని ఎవరూ హర్షించరు. ఈ విధంగా దాడులకు పాల్పడుతున్న వారు సామాన్య ప్రజలను వదులుతారా అన్న ప్రశ్న వస్తోంది. అందుకే అధికార పార్టీ నేతలను అదుపులో పెట్టాలంటే పై స్థాయి నేతలు రంగంలోకి దిగి చక్కదిద్దాల్సి ఉంటుంది. అయితే అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కేడర్ దాడికి దిగినా, ఆ పార్టీ పెద్దలు స్పందించలేదు. ఫలితంగా భువనగిరి జిల్లాలో అక్కడి నేతలు కాంగ్రెస్ ను తిట్టారనే కారణంతో మరోసారి దాడికి దిగారు. అంతకుముందు అల్లు అర్జున్ ఇంటిపైన కూడా దాడి చేసింది కాంగ్రెస్ కేడరే అనే ప్రచారం జరిగింది. ఇలా అధికారంలో ఉన్నామనే ధీమాతో దాడులకు పాల్పడుతూ లా అండర్ ఆర్డర్ ని తమ చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక హై కమాండ్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే చోటామోటా నేతలు కూడా ఇదే పని చేసి దందాలు షురూ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. అలా జరగకముందే పార్టీ పెద్దలు మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.