– ఎంపి రఘురామ, కోటంరెడ్డి, ఆనంపై చర్యలేవీ?
– ఎంపి రాజు అనర్హత వేటుపై ఫలించని యత్నాలు
– పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వేటుపై విఫలయత్నమేల?
– ఇప్పుడు అవకాశం ఉన్నా కోటంరెడ్డిపై వేటుకు వెనుకంజ
– ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శిస్తున్న రాజు, కోటంరెడ్డి, ఆనం
– తాజాగా ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి రుసరుసలు
– ఎంపీ నుంచి సర్పంచుల వరకూ పెరుగుతున్న తిరుగుబాట్లు
– నాయకత్వ నిర్లిప్తతపై వైసీపీ అగ్రనేతల ఆశ్చర్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)
పార్టీని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కంటిచూపుతో శాసిస్తారు. ఎవరిని ఎవరు కలవాలో, ఏ స్ధాయి నేతను ఏ స్థాయి నేతలు కలవాలో ముందే దిశానిర్దేశం చేస్తారు. వారి చుట్టూ ఏం జరుగుతుందో జగనన్నకు నిమిషాల్లో సమాచారం అందుతుంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో జగనన్నకు మినిట్ టు మినిట్ సమాచారం ఉంటుంది. అందుకే ఎవరిని కలవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచన. అందుకే అన్నంటే అందరికీ భయం.
కానీ.. ముగ్గురు ప్రజాప్రతినిధులు మాత్రం, జగనన్నను భేఖాతరు చేస్తున్నారు. ప్రెస్‌మీట్లు వేదికగా రచ్చ రంబోలా చేస్తున్నారు. పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠను రోడ్డెక్కిస్తున్నారు. అయినా ఆ ముగ్గురిపై పార్టీ నాయకత్వం, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం షోకాజ్ నోటీసులూ లేవు. ఎంపి రాజుకు ఇచ్చిన ఆ షోకాజ్ తప్పుల తడక. సాంకేతిక వైఫల్యం. ఎందుకు? వారిని చూసి నాయకత్వం ఎందుకు భయపడుతోంది? వారి చర్యలు మిగిలిన వారికి ఆదర్శం అయ్యే వరకూ ఎందుకు అవకాశం ఇస్తోంది? సర్పంచుల నుంచి కార్పొరేటర్ల వరకూ పెరుగుతున్న ధిక్కార స్వరాలు.. ఏమిటీ పరిస్థితి? ఎందుకీ దుస్థితి? దీనికి కారణం ఎవరు? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ.
నాయకత్వ నిర్లిప్తత కారణంగా పార్టీలో, క్రమశిక్షణ కట్టుదాటుతోందన్న ఆవేదన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నుంచి- నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వరకూ ధిక్కారస్వరం వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలకూ షోకాజ్ నోటీసు జారీ చేయకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై అప్పుడే స్పందించి.. సూటిగా షోకాజ్ నోటీసు ఇచ్చి వెంటనే వేటు వేస్తే, మిగిలిన ఎమ్మెల్యేలకు పార్టీని ఎదిరించాలన్న ఆలోచన వచ్చేది కాదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కానీ వైసీపీ లెటర్ హెడ్‌తో ఇచ్చిన ఫిర్యాదు లేఖ బూమెరాంగయి, ఇప్పుడు రాజు ఏకు మేకయిన వైనాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
రాజుపై వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సస్పెండ్ చేసే అవకాశం వదులుకుని, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే లాభమేమిటో తమకు ఇప్పటికీ అర్ధం కావడం లేదంటున్నారు. నిజానికి రఘురామకృష్ణంరాజును అప్పుడే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే, ఢిల్లీ వేదికగా ఆయన పార్టీని భ్రష్ఠుపట్టించే ప్రయత్నాలు చేసేవారు కాదంటున్నారు.
‘ఆయనను సస్పెండ్ చేసి ఉంటే ఏదో ఒక పార్టీలో చేరిపోయి ఉండేవారు. అలాకాకుండా రాజును సస్పెండ్‌ను చేయకుండా-బహిష్కరించకుండా వదిలేసినందుకు, ఇప్పుడు నాయకత్వం ఫలితం అనుభవించాల్సి వస్తోంది. ఆయన ఢిల్లీలో కూర్చుని.. ప్రధాని నుంచి రాష్ట్రపతి వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాస్తు, ఇబ్బంది పెడుతున్నారు. అదే అప్పుడే ఆయనను సస్పెండ్ చేసి ఉంటే, ఆయన మానాన ఆయన తన పనిచూసుకునేవాడు. ఏదో ఒక పార్టీలో చేరిపూయి ఉడేవారు. ఇప్పుడాయన రోజూ మీడియాలో కనిపిస్తూ , పంటికిందిరాయిలా మారి హీరో అయ్యాడు. చివరకు ఆయనను ఏమీ చేయలేకపోయిందన్న అప్రతిష్ఠను పార్టీ మిగుల్చుకుంద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లాలో భూ మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇసుక, మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించినప్పుడే.. ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి సస్పెండ్ చేస్తే సరిపోయేదని, వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి కుటుంబానికి ఉన్న.. రాజకీయ చరిత్రను అధ్యయనం చేయకుండా, ఆయనను అవమానించిన తీరు.. ప్రజల విమర్శలకు అవకాశం ఇచ్చినట్లయిందని చెబుతున్నారు. ఇప్పటికీ ఆయన పార్టీ-ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నా, సస్పెండ్ చేయకుండా ఉండటమే తమకు ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు.
ఇక తాజాగా పార్టీలో తిరుగుబాటు తుపాను రేపిన.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపైనా, నాయకత్వం ఇంకా మీనమేషాలు లెక్కబెట్టడంపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వంపై కోటంరెడ్డి వ్యతిరేక వ్యాఖ్యు చేశారన్న సమాచారం ఉన్న రోజునే, ఆయనను సస్పెండ్ చేయాల్సిందని స్పష్టం చేస్తున్నారు. అసలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినప్పుడే, ఆయనను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
కానీ తమ చేతులో ఉన్న సస్పెండ్ ఆయుధం ప్రయోగించకుండా.. మంత్రులు-పార్టీ నేతలతో ఆయనపై విమర్శలు,- ఎదురుదాడి చేయించడం వల్ల .. ఏం ఉపయోగమో తమకు అర్ధం కావడం లేదంటున్నారు. దీనివల్ల తామే కోటంరెడ్డిని, ప్రతిరోజూ హీరోను చేస్తున్నామని అభిప్రాయపడుతున్నారు.
‘ధిక్కారస్వరం వినిపించే వారిని సస్పెండ్ చేస్తే, వారికి మరుసటి రోజునుంచీ మీడియాలో అంత ప్రాధాన్యం దక్కదు. ఏదైనా వారు పార్టీలో ఉండి విమర్శలు చేస్తున్నంతవరకే మీడియా ప్రాధాన్యం ఉంటుంది. గతంలో ఇలా వ్యవహరించిన వారికి ఏమయిందో ఓసారి గమనించాలి. అక్కడి దాకా ఎందుకు? నెల్లూరు జిల్లాలోనే ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డిని బహిష్కరించిన తర్వాత- అంతకుముందు ఏమయిందో తెలుసుకోవాలి. ఈ చిన్న లాజిక్ కూడా, మా పార్టీ పెద్దలకు తట్టకపోవడమే వింతగా ఉంద’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
బహుశా తమ నాయకత్వం.. పార్టీని ధిక్కరించేవారిని సస్పెండ్ చేస్తే వారికి మరింత స్వేచ్ఛ వస్తుందని భావిస్తున్నట్లుందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ‘వాళ్లకు రేపు టికెట్లు ఇవ్వరన్న విషయం తెలుసు. వాళ్ల స్థానంలో మేం మరొకరిని పెడుతున్నాం. ఇక వారితో మాకు ఏం పని? అదే సస్పెండ్ చేస్తే.. వారు ఏదో ఒక దారి చూసుకుంటారు. మేం సస్పెండ్ చేయనంత మాత్రాన వారు పార్టీని విమర్శించడం మానుకోరు కదా? అదే సస్పెండ్ చేస్తే వారికి, మీడియాలో పెద్దగా ప్రాధాన్యం ఉండదు. వారి విమర్శలను మీడియా మునుపటి మాదిరిగా పట్టించుకోదు. ఈ వాస్తవం తెలియని వారంతా సలహాదారులుగా ఉండటం మా దురదృష్టం’ అని మరో సీనియర్ నేత విశ్లేషించారు.
తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా, ప్రమాద సంకేతమేనంటున్నారు. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి అనే నేతకు, నాయకత్వం పెత్తనం అప్పగించిన వైనంపై, మేకపాటి బహిరంగంగానే కారాలు మిరియాలు నూరిన విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని నేతలు హెచ్చరిస్తున్నారు.
ధిక్కార స్వరాలపై తమ నాయకత్వం అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరి.. సర్పంచులకు సైతం ఆదర్శంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో బిల్లులు చెల్లించడం లేదంటూ.. వైసీపీ సర్పంచులు రోడ్డెక్కి, భిక్షాటన చేసిన వైనాన్ని వైసీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఇక వైసీపీ కార్పొరేటర్లు సైతం, తమ వార్డుల్లో జరిగిన పనులకు బిల్లుల చెల్లింపుపై మేయర్ ఆఫీసులో, ధర్నాలు చేస్తున్న ఘటనలు మర్చిపోకూడదంటున్నారు.
కాగా.. చివరకు ఎమ్మెల్యేలు సైతం, జడ్పీ సమావేశాల్లో బిల్లుల గురించి మంత్రులను నిలదీస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. గతంలో నెల్లూరు- ప్రకాశం జిల్లా జడ్పీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు.. ఎప్పటిలోగా బిల్లులు ఇప్పిస్తారని, మంత్రులకు డెడ్‌లైన్ విధించిన వైనాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
ఇవన్నీ తమ నాయకత్వ వైఫల్యాలే అని సీనియర్లు అంగీకరిస్తున్నారు. క్రమశిక్షణ అనేది కంటిచూపుతో కాకుండా, సాంకేతికంగా ఉంటేనే ఫలితం ఉంటుందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ధిక్కారస్వరం వినిపించే వారిని సస్పెండ్ చేయదన్న సంకేతం పంపించడం వల్లే, ఎవరూ నాయకత్వాన్ని చూసి నేతలు భయపడటం లేదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే, త్వరలో మరిన్ని అసమ్మతి గళాలు వినిపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.