స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ పర్యటన ముంగిట తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చేది పెద్ద సున్నానే అని కామెంట్ చేశారు. పాలమూరు గడ్డపై పదేళ్ల కిందట ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ప్రాజెక్టుపై అప్పటి యూపీఏ ప్రభుత్వం తీరును మోదీ ప్రస్తావించిన వీడియోను షేర్ చేశారు.
‘పీఎం నరేంద్ర మోదీజీ. 2014లో పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల యూపీఏ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని మీరు ప్రశ్నించారు. 10 సంవత్సరాలుగా నిద్రపోతున్నారా అని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ, మీ ప్రభుత్వం వచ్చాక చేసిందేంటి? మహబూబ్‌నగర్‌పై బీజేపీ ఉదాసీనతకు ఇప్పుడు మరో పదేళ్లు గడిచిపోయాయి. ఈ పదేళ్లలో పాలమూరు అభివృద్ధికి మీరేం చేశారో ఈ రోజు అద్దంలో చూపించాలని అనుకుంటున్నా. ఇన్నేళ్లలో మీరు పాలమూరుకు చేసింది శూన్యం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీ బీజేపీ పార్టీకి ఇచ్చే సీట్లు కూడా పెద్ద సున్నానే’ అని కేటీఆర్ పేర్కొన్నారు.