బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మృతి చెందారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. శాసన ఉల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు.. పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతో సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను.. అధికార అవామీలీగ్, దాని విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో వాటిని నిరోధించేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి.
దేశవ్యాప్తంగా రోజంతా కొనసాగిన గొడవల్లో దాదాపు 100 మంది మృతి చెందారు. నార్సింగ్ ప్రాంతంలో అధికార అవామీలీగ్‌కు చెందిన ఆరుగురు నేతలను ఆందోళనకారులు కొట్టి చంపేశారు. బుల్లెట్ గాయాలతో 56 మంది ఢాకా వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. ఢాకాలో బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ వర్సిటీ వద్ద అనేక వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పోలీసు ప్రధాన కార్యాలయం వివరాల ప్రకారం 14 మంది పోలీసులు మృతి చెందగా మొత్తం 300 మంది పోలీసులకు గాయపడ్డారు.
ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రాం సేవలనూ నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ప్రజా భద్రతను పరిగణనలోకి తీసుకుని నేటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కారని.. ఉగ్రవాదులని ప్రధాని హసీనా పేర్కొన్నారు. చర్చలకు ఆహ్వానిస్తూ శనివారం ఆమె ఇచ్చిన పిలుపును యాంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్ తిరస్కరించింది. ఇటీవల ఇదే అంశంపై చోటుచేసుకున్న ఘర్షణల్లో దాదాపు 200లకు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులను భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో సంప్రదిస్తూ ఉండాలని ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.