రాష్ట్రాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా కూటమి సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా… ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాలులో పలు కీలక అంశాలపై సమీక్షించనున్నారు. 100 రోజుల కార్యాచరణపై దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అమలు చేయాలనుకున్న కలెక్టర్లు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించి దాని అమలుకు కార్యాచరణ ఇవ్వనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూ కుంభకోణాల గురించి పెద్దయెత్తున వినతులు అందుతున్న నేపథ్యంలో… బాధ్యులకు న్యాయం చేసేందుకు వీలుగా జిల్లాల వారీ ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. శాంతి భద్రతలు, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, భూముల లభ్యత గురించి నివేదికలు కోరనుంది. రెవెన్యూలో తీసుకురానున్న మార్పులు, చట్టాల సవరణ, భూముల రీ సర్వే, భూ ఆక్రమణలు తదితర అంశాలపై ప్రసంగించనున్నారు. అధికారులు పలు అంశాలపై ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు.