రాష్ట్రంలో ఇప్పటికే స్థలం అందుబాటులోకి వచ్చిన 20 ప్రాంతాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ల నిర్మాణం ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యాశాఖ, ఆర్‌అండ్‌బీ, ప్రైవేటు నిర్మాణ సంస్థలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ల లేఅవుట్, నిర్మాణ డిజైన్లు, వసతులు, బడ్జెట్ అంశాలపై భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు వచ్చిన స్థలాలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 37 ప్రాంతాల్లో 49 పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన స్థలాల వివరాలు వచ్చినట్టు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి భట్టికి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో కబడ్డీ వంటి క్రీడలకు అనువైన స్థలం, పార్కులు వంటి నిర్మాణ వివరాలను డిప్యూటీ సీఎం భట్టి అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్‌లకు త్రిబుల్ బెడ్ రూమ్, ఇతర సిబ్బందికి డబుల్ బెడ్ రూమ్, ఉన్నత విద్యాశాఖ అధికారులు పర్యటనకు వచ్చిన క్రమంలో బస చేసేందుకు సౌకర్యంగా నిర్మాణాలు ఉండాలని భట్టి ఆదేశించారు.