‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికలు రావటంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది. ఈ బిల్లులో పలు సవరణలు చేసి, ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేశారని, వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది. అంతేకాకుండా బిల్లు కాపీని ఇచ్చిన ప్రతీ వ్యక్తికీ ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్‌మార్క్ ముద్రించారని.. ఒకవేళ ఎవరైనా బిల్లును ‘లీక్’ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవటానికి ఇలా చేశారని తెలుస్తోంది. దేశ ప్రజానీకాన్ని ప్రభావితం చేసే చట్టాల రూపకల్పన విషయంలో ఇంతటి గోప్యత ఏమిటంటూ ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక తన సంపాదకీయం ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించింది. సవరించిన బిల్లులో స్వతంత్ర మీడియా గొంతు నొక్కే పలు ఆంశాలున్నాయంటూ విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
స్వతంత్ర భారతంలో మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఈ బిల్లును ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్వతంత్ర మీడియా సంస్థలపై ప్రభుత్వ నిఘా పెరుగుతుందన్నారు. బిల్లులో సవరణలు చేసి ఆ ప్రతులను రహస్యంగా కొందరు వ్యక్తులకు, కొన్ని వ్యాపార సంస్థలకు ఇచ్చారని, పార్లమెంటుకు మాత్రం ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ అన్నారు. సవరించిన బిల్లు ఇప్పటి వరకూ బహిర్గతం కాలేదు. వాస్తవానికి, ఒక బిల్లు చట్ట రూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగంగా వెల్లడించి దానిపై ప్రజానీకం నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఆహ్వానించాలి. వాటిపై సమీక్ష జరిపి బిల్లుకు తుదిరూపం ఇవ్వాలి. కానీ ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో ఈ ప్రక్రియ జరగటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్న వారిని ఇకపై డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారు. బిల్లు చట్టరూపం దాల్చిన నెలరోజుల్లో ఈ యూ ట్యూబర్లు ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ కిందికి ఇక మీదట యూ ట్యూబర్లు కూడా వస్తారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలను తనిఖీ చేయవచ్చు. ఆ సందర్భంగా అవసరమైతే అక్కడున్న పరికరాలు ఏవైనా స్వాధీనం చేసుకోవచ్చు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు నిషేధం కూడా విధించవచ్చు.
మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో ప్రధాన మీడియాను ముఖ్యంగా జాతీయ మీడియాను తన కనుసన్నల్లో పెట్టుకుందని.. దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా తాము నిర్వర్తించామని ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు చెబుతున్నారు. అందుకే సర్కారు తమపై కక్షగట్టి, ఈ కొత్త బిల్లు తీసుకొస్తుందని ఆరోపిస్తున్నారు. తమ కృషి వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గౌరవనీయమైన స్థాయిలో సీట్లు లభించాయని పేర్కొన్నారు. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. పార్లమెంటులో దీని గురించి ప్రస్తావించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నిజంగానే సోషల్ మీడియాలో ఉన్న తప్పుడు ధోరణులను ఎదుర్కొనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే తాము సహకరిస్తామని పలువురు యూట్యూబర్లు పేర్కొంటున్నారు. బిల్లును బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ జరుపుతున్నారు.