వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని చెప్పారు. టిటిడి ఇఓ శ్యామలారావుతో ఏర్పాట్లపై చర్చించానని అన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేశారు.
జనవరి 10నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. 10,11,12వ తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోవద్దని.. టోకెన్లను తీసుకోవాలన్న ఆతృతలో తోసుకోవద్దని సూచించారు. 19వ తేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పారు. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విఐపిలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం టికెట్ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. జనవరి 10నుంచి 19వతేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచనుంది టీటీడీ. తిరుపతిలో 9వ తేదీ ఉదయం 5.30గంటలకు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుపతి నగరంలోని 9కేంద్రాల్లో 91కౌంటర్లలో టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది.
భక్తుల మధ్య తోపులాటలు లేకుండా టోకెన్లను జారీ చేయాలని టిటిడి సిబ్బందిని టిటిడి ఛైర్మన్ ఆదేశించారు. అలిపిరి వద్ద నిర్మితమవుతున్న వైశ్రాయ్ హోటల్ పనుల నిలుపుదల ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పారు.