తమిళనాడులో ఫెయింజల్ తుపాను బీభత్సం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో ఆదివారం ఆరుగురు మృతి చెందగా.. నిన్న మరో 18 మంది మృతి చెందారు. తిరువణ్ణామలైలో రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు మొన్న సాయంత్రం స్థానిక వావూసీనగర్‌లో కొండపై నుంచి పెద్దబండరాళ్లు దొర్లి రెండు ఇళ్లపై పడ్డాయి. రాజ్‌కుమార్ ఇంటిపై 20 అడుగుల పైనుంచి బండరాయి పడటంతో పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. రాజ్‌కుమార్, అతని భార్య మీనా, కుటుంబసభ్యులు వినోదిని, మహా, దేవిక, గౌతం, వినియ మట్టిలో కూరుకున్నట్లు అధికారులు గుర్తించారు. 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఆదివారం అర్ధరాత్రి నుంచే వారిని కాపాడేందుకు యత్నించారు. కానీ, కుండపోత వర్షం, చిమ్మచీకటి, ఇరుకు ప్రాంతానికి తోడు పొక్లెయిన్ వెళ్లేందుకూ వీల్లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిన్న ఉదయం నుంచి మట్టి తొలగించగా, రాత్రికల్లా ఏడుగురి మృతదేహాలు బయటపడ్డాయి.
విల్లుప్పురం జిల్లాలో వర్షాలకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. నీలగిరి జిల్లా ఊటీ నొండిమేడు ప్రాంతంలో ఇంటిగోడ కూలి ఒకరు చనిపోయారు. పుదుచ్చేరిలో నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తుపాను నిన్న అల్పపీడనంగా బలహీనపడినట్లు వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. రేపటికి ఉత్తర కేరళ- కర్ణాటక తీరం మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కలిసిపోవచ్చని పేర్కొంది. కృష్ణగిరి జిల్లాలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 50.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఊత్తంగరై పాంబారు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పోచ్చంపల్లి పోలీసుస్టేషన్ ముంపునకు గురైంది. పలుచోట్ల పంటపొలాలు, రోడ్లు నీట మునిగాయి. ఊత్తంగరై బస్టాండ్ సమీపంలో నిలిపిన పర్యాటక వాహనాలు వరదల్లో కొట్టుకుపోగా, క్రేన్ల ద్వారా బయటకు తీశారు.