సినిమా థియేటర్‌లో సినిమా ప్రారంభమయ్యే ముందు సుదీర్ఘమైన ప్రకటనల ద్వారా మనలో చాలా మందికి విసుగు, చికాకు కూడా కలిగి ఉండొచ్చు. అయితే ఇంత చిన్న విషయం కోర్టు కేసుకు దారితీస్తుందని ఎవరైనా ఊహించారా..? కానీ అలాగే జరిగింది. కేసు వేయడమే కాదు.. గెలిచాడు కూడా. సినిమా చూసేందుకు వస్తే చెప్పిన సమయానికి కాకుండా థియేటర్ లో చాలా సేపు వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడం వల్ల తన విలువైన సమయం 25 నిమిషాలు కోల్పోయానని పేర్కొంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, బుక్ మై షోలపై దావా వేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? కోర్టు ఏం చెప్పింది ?
ఈ పిటిషన్ పై విచారణ చేసిన బెంగళూరు వినియోగదారుల కోర్టు.. పీవీఆర్ తో విలీనమైన పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ కు వ్యతిరేకంగా ఇటీవల తీర్పు ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శించే అడ్వర్టేజ్మెంట్స్ సమయాన్ని తీసేసి కేవలం సినిమా ప్రారంభమయ్యే ఖచ్చిత సమయాన్ని మాత్రమే టికెట్ లపై ప్రింట్ చేయాలని సూచించింది. 2023లో సామ్ బహదూర్ సినిమాకు వెళ్లిన అభిషేక్ అనే ప్రేక్షకుడు వేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ వాణిజ్య ప్రకటనల కారణంగా తన సమయాన్ని 25 నిమిషాలు కోల్పోయినట్లు అభిషేక్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ప్రతివాదులుగా పీవీఆర్, బుక్ మై షోలను చేర్చుతూ.. చర్యలు తీసుకోవాలని కోరాడు.
అభిషేక్ పిటిషన్ పై విచారించిన బెంగళూరు వినియోగదారుల కోర్టు.. టిక్కెట్ల ప్లాట్‌ఫామ్ సినిమా షెడ్యూల్‌లను నియంత్రించదని పేర్కొంటూ బుక్‌మైషోకు విముక్తి కల్పించింది. థియేటర్లలో ప్రకటనలు ప్రదర్శించడమనేది పీవీఆర్, ఐనాక్స్ చేతుల్లో ఉంటుంది కాబట్టి.. అవే ఇందుకు బాధ్యత వహించాలని పేర్కొంది. టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ సినిమాకి ముందు ప్రకటనలను చూడమని ప్రేక్షకులను బలవంతం చేయడం సమంజసం కాదని తెలిపింది. ప్రజలు తరచుగా రోజూవారి బిజీ షెడ్యూల్ లోనే సొంత పనులకు కూడా సమయం కేటాయిస్తారని.. అలాంటప్పుడు అనవసరమైన విషయాలపై వారి సమయం వృథా చేయకూడదని సూచించింది.
తీర్పులో భాగంగా సినిమా ప్రారంభమయ్యే వాస్తవ సమయాన్ని మాత్రమే సినిమా టిక్కెట్లపై ఉండేలా చూడాలని పీవీఆర్, ఐనాక్స్ లను కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా చెప్పిన సమయానికి మించి ప్రకటనలు ప్రదర్శించరాదని మల్టీప్లెక్స్ ఆపరేటర్లను ఆదేశించింది.
పీవీఆర్, ఐనాక్స్ వాదనలు
పీవీఆర్ సినిమాస్ , ఐనాక్స్ తమ వాదనలను వినిపిస్తూ.. చట్టబద్ధంగా ప్రజల అవగాహన కోసం పబ్లిక్ సర్వీస్ ప్రకటనలను (PSAs) ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. అయితే దీనిని వినియోగదారుల ఫోరమ్ అంగీకరించింది.. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా PSAలను 10 నిమిషాలకు పరిమితం చేసి, సినిమా షెడ్యూల్ చేసిన ప్రారంభ సమయానికి ముందే వాటిని ప్రసారం చేయాలని సిఫార్సు చేసింది.
భద్రతా తనిఖీల వల్ల ఆలస్యంగా వచ్చే ప్రేక్షకులకు ప్రకటనలు పొడిగించడం వల్ల ప్రయోజనం కల్పించడమే తమ ఉద్దేశ్యమని పీవీఆర్, ఐనాక్స్ కోర్టులో తమ వాదనలు వినిపించాయి. వీరి వాదనలతో ఏకీభవించని కోర్టు.. ఆలస్యంగా వచ్చే వారి కోసం సమయపాలన పాటించే వీక్షకులకు అసౌకర్యం కలిగించడం అన్యాయమని పేర్కొంటూ కమిషన్ ఈ వాదనను తోసిపుచ్చింది. బెంగళూరు కోర్టు ఇచ్చిన తీర్పు వినియోగదారుల హక్కులు, సమయం యొక్క విలువను నొక్కి చెబుతుంది.
అభిషేక్ కు నష్టపరిహారం
ఫిర్యాదు దారుడు అభిషేక్ కు కలిగిన అసౌకర్యానికి, అనుభవించిన మానసిక ఒత్తిడికి పెనాల్టీ కింద రూ.20వేలు చెల్లించాలని మల్టీప్లెక్స్ చెయిన్స్ ని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు ఖర్చులకు మరో రూ. 80వేలు చెల్లించాలని సూచించింది. అంతేకాకుండా పీవీఆర్, ఐనాక్స్ అవలంబిస్తున్న పద్ధతులకు నష్టపరిహారంగా కు రూ. లక్ష జరిమానా విధించింది.
అన్యాయమైన వ్యాపార విధానాలను అవలంబించినందుకు పీవీఆర్ ,ఐనాక్స్ కు రూ. 1 లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 15 న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, ఈ మొత్తాన్ని 30 రోజుల్లోపు వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.