నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థినిలు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమచారం మేరకు మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుండి స్కూల్ కు వెళ్తామని బయలుదేరారు. కానీ పాఠశాలకు వెళ్లకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వరలక్ష్మి తండ్రి తన కూతురు ఇంటి నుండి పాఠశాలకు వెళ్లిందని చెప్పారు. మిగతా ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఫోన్లు కలవలేదు. కాగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులకు తెలియడంతో సమాచారం కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్సె వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకొని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.