ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరోసారి మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
2025-26కు సంబంధించి సుమారు 3.20 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ఉండనుందని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్ర పునఃనిర్మాణం దిశగా అడుగులు వేయించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇది కీలక బడ్జెట్ కాబోతుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల అమలు కీలకం కాబోతోంది. ఏప్రిల్ నుంచి అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, మే నుంచి తల్లికి వందనం పథకాల అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ అమలు చెయ్యాలంటే వెంటనే రూ.20వేల కోట్లు అవసరం అని అంచనా. వీటిని ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఇవాళ్టి బడ్జెట్‌లో ఈ పథకాలకు కేటాయింపులు కీలకం కాబోతున్నాయి. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. దాదాపు 50 వేల కోట్ల రూపాయలను వ్యవసాయానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.