గురువారం ఏపీలోని కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర నియోజవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడే ఓ విశేషం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేశ్ .. ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు వేయలేదు.. ఎందుకని?
ఉండవల్లిలోని పోలింగ్ బూత్ లో చంద్రబాబు, నారా లోకేశ్ లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటు వేయకపోవడమేంటి?.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో 21 స్థానాలు గెలుచుకుని దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్. కానీ ప్రస్తుతం ఆయన ఓటు వేయలేదనే అంశం చర్చనీయాంశమైంది. గురువారం జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటు వేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన టీచర్ కాదు కాబట్టి. టీచర్స్ మాత్రమే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. మరొక ఎన్నికలు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్ ఓటు వేశారు. ఎందుకంటే వారు గ్రాడ్యుయేట్స్ కాబట్టి. పట్టభద్రులందరికీ ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది.
మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. ఎందుకంటే ఆయనకు డిగ్రీ లేదు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఇంటర్ తో చదువు ఆపేశారు. ఆయన డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించినప్పుడు తాను డిగ్రీ చదువుకోనందుకు చాలా బాధపడుతున్నానని చెప్పాడు.
తన శాఖలకు సంబంధించిన కొన్ని ఫైల్స్ అర్ధం కావడం లేదని.. డిగ్రీ చదువుకుని ఉంటే ఫైళ్లు అర్ధం అయి ఉండేవని తానే స్వయంగా చెప్పారు. తనకు ఇప్పుడు చదువు విలువ తెలుస్తోందని అన్నారు. సో.. ఆయనకు డిగ్రీ పట్టా లేదు కాబట్టే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయింది.