సిమ్ మాఫియాపై సైబర్ క్రైమ్ పోలీసుల ఉక్కుపాదం
సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 56 మంది అరెస్టు
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు
13 రాష్ట్రాల్లో దాడులు
7 రోజుల పాటు 18 బృందాలతో సాగిన ఆపరేషన్
1,194 సిమ్ కార్డులు గుర్తింపు
544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
సిమ్ మాఫియాపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 56 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. 13 రాష్ట్రాల్లో దాడులు చేశారు. 7 రోజుల పాటు 18 బృందాలతో సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 1 వెయ్యి 194 సిమ్ కార్డులను గుర్తించారు. 544 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కస్టమర్ల బయోమెట్రిక్‌లతో అక్రమంగా అదనపు సిమ్ యాక్టివేషన్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు నేరాలకు పాల్పడుతున్నాయి. సిమ్‌లను e-SIMలుగా మార్చి విదేశీ సైబర్ గ్యాంగ్‌లకు పంపిణీ చేస్తున్నారు.
వాట్సాప్, టెలిగ్రామ్, డేటింగ్ యాప్స్ ద్వారా ఈ ముఠా మోసాలు చేస్తున్నట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. సెక్స్‌టార్షన్, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో కూడా ఈ సిమ్‌లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
సిమ్ మాఫియా బట్టబయలైన నేపథ్యంలో టెలికాం సంస్థలతో హైదరాబాద్ పోలీసులు సమావేశానికి సిద్దమయ్యారు. ప్రజలు ఆధార్, ఓటీపీ వివరాలు పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసం జరిగితే 1930కు కాల్ చేయాలని సూచించారు.


