ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అడవి బిడ్డలు నిర్వహించే పండువలు, జాతరలు యావత్ జగతికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ, నాగోబో జాతరలు ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరలుగా పేరు పొందాయి. ఏపీ అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ లో ఇదే రీతిలో జరిగే ఓ గొప్ప జాతర ఉంది. అదే, అతి పెద్ద మన్యం కొండ జాతర. అయితే, ఒడిశా, ఏపీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాతర జరుగుతుంది. రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఒకే గొప్ప జాతర వేడుక జరగడం చాలా అరుదైన విషయం.
ఆరోగ్యకర పోటీ, ఆనందదాయక భేటీ, అభివృద్దిలో మేటి, అన్నింటా ఎవరికీ తీసిపోని ధాటి.. ఇవీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాధిస్తున్న ఘనవిజయాలు. రాష్ట్రాలు విడివడినా…ఆచారాలు, సంప్రదాయాలు, పండువలు, జాతరలు, తిరనాళ్లలో….తమ తరవాతే ఎవరైనా అనే రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సత్తా చూపుతున్నాయి. జాతర విషయాలకు వస్తే.. యావత్ విశ్వంలోనే అతి గొప్ప గిరిజన జాతరలుగా సమ్మక్క-సారలమ్మ జాతర, నాగోబా జాతరలు పేరు సంతరించుకుని ప్రపంచంతో శభాష్ అనిపించుకుంటున్నాయి. ఇక, ఎలుగెత్తెను ఆ కంఠం మనదే రాజ్యం..ఈ పాట ప్రతి దేశభక్తుడి నోట వినిపిస్తుంది. ఆ కంఠం అల్లూరి సీతారామరాజుది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా..! విప్లవబాటలో స్వాతంత్ర సముపార్జనకు పాటుపడ్డ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆ మహనీయుని పేరిట ఏపీలో ఏర్పడిన జిల్లా అల్లూరి జిల్లా. ఈ జిల్లా చింతూరు డివిజన్ లో మన్యం కొండ జాతర అంటే ప్రతి ఒక్కరిలో దైవభక్తి, దేశభక్తి పెల్లుబుకుతుంది. ప్రకృతితో కలిసి అడవి బిడ్డలు నిర్వహించే మహోన్నత జాతర మన్యం కొండ జాతర. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు, ఒడియా సోదర, సోదరీమణులు అందరూ…గిరిపుత్రులు అతి పెద్ద పండువగా నిర్వహించే మన్యం కొండ జాతరపై విశేష ఆసక్తి కనబరుస్తారు. ఈ ఏడాది మార్చి మూడో తేదీన మహోన్నత రీతిలో ఈ జాతర జరగనుంది.
ఆదరణ, గౌరవం, మర్యాద అనేవి నరనరాన జీర్ణించుకున్న భారత జాతి…ప్రాచీన సంస్కృతి, పూర్వ నాగరికతలకు పెద్ద పీఠ వేస్తుంది. ఇందులో మన్యంవాసులు అగ్రభాగాన ఉంటారు. పూర్వాచార జాతరలు, ప్రాచీన సంప్రదాయ వేడుకలు తూచ తప్పక పాటించడంలో ఏ మాత్రం రాజీ పడరు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్ ఘఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో… అతి భారీస్థాయిలో జరిగే అడవి బిడ్డల మన్యం కొండ జాతరకు సమయం సమీపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ చింతూరు డివిజన్ లో సాగే ఈ జాతర ఏర్పాట్లపై ఇప్పటికే ఏపీ ఐటీడీఏ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీస్ అధికారులు జాతర ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు.
విచిత్రం ఏమిటంటే.. ఈ జాతర ఏపీ, ఒడిశాలతో ముడిపడి ఉంటుంది. తొలుత ఒడిశాలో ప్రారంభం అవుతాయి. ఏపీలో ఈ వేడుకలు ప్రారంభానికి నెల్లాళ్ల ముందు నుంచే ఒడిశాలో వేడుకలు నిర్వహిస్తారు. ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడిని కన్నమరాజుగా, అర్జునుని బాలరాజుగా, భీముడిని పోతురాజుగా కీర్తిస్తూ.. వీరిని వనదేవతలుగా ఆరాధిస్తారు. అందుకే జాతరలో ముత్యాలమ్మ తల్లితో పాటు కన్నమరాజు, బాలరాజు, పోతురాజులను పూజిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి మోతుగూడెం పొల్లూరు జలపాతం వద్ద ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టి ఈ వేడుక నిర్వహిస్తారు.
ఒడిశా.. ఈ మాట వినగానే ముందుగా దర్శనమిచ్చేది పూరీ జగన్నాథస్వామి రథయాత్ర. కదిలాయి అంటే ఆగనివి జగన్నాథ రధచక్రాలు. ఈ పండువ వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అదేరీతిలో కోణార్క సూర్య దేవాలయానికి పెద్ద పేరుంది. ఈ రాష్ట్రంలోని మల్కనగిరిలో కొలువై ఉన్న గిరిజన వనదేవత ముత్యాలమ్మ తల్లి. ఈ జాతరలో ముత్యాలమ్మ తల్లితో పాటు ఆమె సోదరులు కన్నమరాజు, బాలరాజు, పోతురాజు సైతం భక్తుల పూజలు అందుకుంటారు.
ఒడిశా మల్కానగిరి నుంచి అమ్మవారి ఘటాన్ని, ధ్వజ రూపంలో ఉన్న ఆమె సోదరులను మన్యంకొండ కు తీసుకొని వస్తారు. అదే సమయంలో మోటు గ్రామంలోని నడవనపల్లి నుంచి కొత్త వెదురులను ఇక్కడకు తీసుకొస్తారు. ధ్వజాల కోసం ఈ కొత్త వెదురును తీసుకొస్తారు. మన్యం కొండ గ్రామంలో కొండ గుహలో మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రకు బయల్దేరతారు. ఈ యాత్రలో భక్తులు కొండలు, కోనలు మీదుగా పాదరక్షలు లేకుండా పాదయాత్ర సాగిస్తారు. ఒడిశా మేళతాళాలతో, ధింసా నృత్యాలతో అమ్మవారుతో కలిసి నడక సాగిస్తారు.
గిరిజన సంప్రదాయం ప్రకారం వెదురుతో చేసిన ప్రత్యేక వాహనంలో అమ్మవారిని ఒడిశా నుంచి తీసుకొస్తారు. ఏపీ సరిహద్దులోని సీలేరు నది దాటించి, మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరుకు అమ్మవారిని తీసుకొస్తారు. మేళతాళాలు, ధింసా నృత్యాలతో సాగే ఈ జాతర అమ్మవారి గద్దెల వద్దకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఏపీ అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక్కడి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అమ్మవారిని పొల్లూరు జలపాతం వద్దకు తీసుకెళ్లి, అక్కడి గుహలో ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి మంగళస్నానం,పాత ధ్వజాల నిర్మూలన అనంతరం కొత్త ధ్వజాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారు. జలపాతం వద్ద ఉన్న అమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడతారు.
జలపాతం వద్ద పూజలకు సంతృప్తి చెందిన అమ్మవారు బంగారు చేప రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే జలపాతం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మార్చి మూడో తేదీన జరిగే ఈ వేడుకలో ఏ విధమైన తొక్కిసలాటలకు తావులేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు భద్రతా చర్యలు చేపట్టి దాదాపు 500 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లులో సివిల్, సిఆర్పియఫ్, మహిళా పోలీసులు, యస్డిఆర్ఎఫ్, ఫైర్ రెవెన్యూ అధికారులు తలమునకలై ఉన్నారు. మరో వైపు పంచాయితీ, ఎపిజెన్కో, అటవీశాఖ అధికారులు, వైద్య ఉద్యోగులు తమ వంతు సేవలు అందించడానికి రెడీ అయ్యారు.
ఇక్కడ ఈ వేడుక పూర్తయ్యాక.. తిరిగి సీలేరు నది దాటించి అమ్మవారిని ఒడిశా మల్కానగిరికి తీసుకెళతారు. జాతరలో పాల్కొన్న యావన్మంది భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. గతంలో జాతరకు వచ్చిన భక్తులు సీలేరు నది దాటడానికి పడవల మీద తరలివచ్చేవారు. వేలాది మంది భక్తులు బోట్ల మీద రావడం వల్ల ఎప్పుడు, ఏ ప్రమాదం సంభవిస్తుందో అని భయపడడం జరిగేది. దీంతో ఒడిశా సర్కారు సిఆర్ నదిపై వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే, ఈ వంతెన పూర్తి కాలేదు. భక్తుల సౌకర్యార్థం సీలేరు నదిపై తాత్కాలికంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్టు ఒడిశా సర్కారు తెలియజేసింది.
———