ఏపీలో టీడీపీలో ఇప్పుడు జీవీ రెడ్డి ఉదంతం వివాదంగా మారింది. జీవీ రెడ్డి రాజీనామా విషయంలో టీడీపీ కేడర్ అంతా ఒక్కటై.. ఏకంగా పార్టీ అధిష్టానాన్నే ప్రశ్నిస్తుంది. జీవీ రెడ్డికి మద్దతుగా అనేక మంది మీడియా ముందు మాట్లాడుతున్నారు. పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో వందల కొద్ది పోస్టులు పెడుతున్నారు. ఇదంతా ఒక్క జీవీ రెడ్డి కోసమే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. టీడీపీకి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు రాజీనామా చేశారు. కానీ వాళ్ల విషయంలో ఏనాడూ నోరు మెదపని టీడీపీ నాయకులు, కేడర్.. జీవి రెడ్డి కోసం మాత్రం గళం విప్పుతున్నారు. ఇది చంద్రబాబు, నారా లోకేశ్‌లను కూడా పునరాలోచనలో పడేసింది.
జీవి రెడ్డి లాంటి నాయకుడిని పార్టీ వదులుకోవద్దంటూ టీడీపీ కేడర్ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు, లోకేశ్ తమ వైఖరి మార్చుకొని.. జీవీ రెడ్డి విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నలువైపుల నుంచి ఇలా ఒత్తిడి పెరుగుతుండటంతో చంద్రబాబును కూడా ఆలోచనలో పడేసిందట. జీవీ రెడ్డి విషయంలో పార్టీ పునరాలోచన చేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారు. త్వరలోనే మరో ముఖ్యమైన పదవి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తాజాగా తన పదవితో పాటుగా టీడీపీకి రాజీనామా చేయడం కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఫైబర్ నెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు.. అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవటం.. వంటి అంశాలపై జీవీ రెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను.. బహిరంగంగా వెల్లడించడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వానికి డామేజ్ చేసే విధంగా ఓపెన్ గా మాట్లాడటం పైన అధినేత చంద్రబాబు మందలించినట్లు సమా చారం. దీంతో మనస్థాపం చెందిన జీవీ రెడ్డి తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు.
జీవీ రెడ్డి రాజీనామా అంశంలో టీడీపీ కేడర్ స్పందించింది. జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదించడాన్ని టీడీపీ శ్రేణులు ముక్తకంఠంతో ఖండించాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబు, లోకేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ కోసం పని చేసే నేతలు.. నాయకుల కంటే అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీశారు.ఆత్మగౌరవం కోసమే జీవీ రెడ్డి రాజీనామా చేసారంటూ.. ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతే కాకుండా జీవీ రెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పార్టీ అధికారంలో లేని సమయంలో జీవీ రెడ్డి ఎంతగానో పోరాడారని టీడీపీ నాయకులు కూడా గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం ఏమి చేయడానికైనా వెనకడుగు వేయని.. నిజాతీపరుడైన నాయకుడిని ఇలా వదులు కోవడం భావ్యం కాదని సూచిస్తున్నారు. జీవీ రెడ్డి రాజీనామా అంశంలో పార్టీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చెబుతున్నారు. ఎన్నడూ లేనంతగా పార్టీలో ఒక వ్యక్తి కోసం ఇంత మంది పాజిటివ్‌గా స్పందిస్తుండటంతో అధిష్టానం ఒక్క సారిలో ఆలోచనలో పడిందట. జీవీ రెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందట.
జీవీ రెడ్డి కోసం టీడీపీ శ్రేణులు అంతా ఏకమవడంతో అతడిని మళ్లీ పార్టీలో యాక్టీవ్ కావాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా జీవీ రెడ్డికి మరో కీలక పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నారట. జీవీ రెడ్డి కనుక పార్టీలో తిరిగి యాక్టీవ్ అయితే భవిష్యత్‌లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను కొంత మంది నాయకులు అధిష్టానం ముందు ఉంచినట్లుతెలిసింది. అయితే ఫైబర్ నెట్ పదవిని మరో నేతకు ఇచ్చి.. జీవీ రెడ్డికి మరో పదవిలో సర్థుబాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి టీడీపీ కేడర్ అంతా ఏకమై ఒక నాయకుడిని తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడం నిజంగా ఆశ్చర్యమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి జీవీ రెడ్డి రీఎంట్రీ ఉంటుందా? ఆయన పార్టీలోకి వస్తే ఏ పదవి ఇస్తారనేది వేచి చూడాలి.