నిధుల దుర్వినియోగం కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , HCA మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ED ఎదుట విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్‌లోని క్రికెట్ స్టేడియం ఆధునీకరణ పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దాదాపు 3.8 కోట్లతో జరిపిన కొనుగోళ్లు, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు వంటి పనుల్లో అవకతవకలు జరిగాయని, అదనపు చెల్లింపులతో పాటు చేయని పనులకు కూడా బిల్లులు మంజూరు చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లోనూ అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అభియోగపత్రం దాఖలు చేసింది. దీని ఆధారంగా ED మరో కేసు నమోదు చేసింది. అవకతవకల వ్యవహారంలో నిధుల మళ్లింపు జరిగిందని భావిస్తున్న ఈడీ.. దీన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు మొదలుపెట్టింది.
ఇందులో ఈనెల 3వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని అజారుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. అనివార్య కారణాల వల్ల తాను ఆ తేదీన హాజరుకాలేనని,.. వారం రోజుల గడువు కావాలని కోరుతూ ఈడీ అధికారులకు అజారుద్దీన్ ఈ మెయిల్ పంపారు. దీంతో 8వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు మరో నోటీసు పంపారు. ఈ మేరకు ఆయన నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి ఎనిమిదన్నర వరకు ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. తనపై కుట్ర పూరితంగా కేసులు పెట్టారని అజారుద్దీన్ ఆరోపించారు. తనపై పెట్టిన కేసులన్నీ అక్రమమేనని.. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. HCA కేసులోనే తనను విచారణకు పిలిచారని, ఈడీ అధికారులకు సహకరించానని చెప్పారు.