హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ కూల్చివేతలపై పలువురు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇవాళ విచారణ జరుగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరుకాగా.. అమీన్‌పూర్ తహశీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు.
విచారణ సందర్భంగా శని, ఆదివారాలు ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అసలు ఆదివారం ఎందుకు పని చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం. శని, ఆదివారాల్లో కూల్చి వేయొద్దంటూ గతంలో తీర్పులున్నాయి కదాని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తహశీల్దారుకు తెలియదా అని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.
తహశీల్దార్ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. దీనిపై స్పందించిన హైకోర్ట్… తహశీల్దార్ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించింది. ఆయన చెబితే చార్మినార్ కూల్చేస్తారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు హైకోర్ట్ న్యాయమూర్తి. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందని వివరణ అడిగింది. పొలిటికల్ బాస్‌లను మెప్పించేందుకు.. సంతృప్తి పరిచేందుకు చట్టవిరుద్దంగా పనిచేయొద్దని ఆదేశించింది. చనిపోయే వ్యక్తిని సైతం చివరి కోరిక అడుగుతారు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్ట్. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళతారు అంటూ హెచ్చరికలు చేసింది హైకోర్ట్.