యుద్దం ఎప్పటికీ సమస్యలకు పరిష్కారాలు చూపబోదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. యుద్దం వల్ల మానవ సమాజం వినాశనం వైపు అడుగులు వేయడం తప్ప మరేమీ జరగదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మానవ భవిష్యత్తు కేవలం యుద్దాలను వ్యతిరేకించిన బుద్ధుడు చూపిన మార్గంలోనే ఉందన్నారు ఆయన. ఒడిశాలోని భువనేశ్వర్‌లో 18వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా, ఇజ్రాయెల్ పేర్లను ప్రస్తావించకుండా యుద్దం వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు.
ప్రవాసీ భారతీయ దివస్‌కు ఒక ప్రత్యేకత ఉందన్నారు ఆయన. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి తొమ్మిదో తేదీనే భారతదేశానికి తిరిగి వచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాలో జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 156 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా అనేక అధ్యాత్మిక, చారిత్రాత్మక ప్రదేశాల గుండా ప్రయాణిస్తుంది.
భారతదేశానికి ఓ గొప్ప ఆధ్మాత్మిక వారసత్వం ఉందన్నారు. గౌతమ బుద్ధుడు పుట్టిన నేలగా ప్రపంచపటంపై భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ వారసత్వ బలం కారణంగానే భారతదేశం ఎప్పటికీ శాంతినే కోరుకుంటుందన్నారు. అలాగే ఒరిస్సాలో అడుగడుగునా ఆధ్యాత్మిక వారసత్వం కనిపిస్తుందన్నారు. ఒరిస్సా కు చెందిన అనేకమంది సుమత్రా, బాలి, జావా వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసి విజయాలు సాధించారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు.
ప్రపంచపటంపై భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రానున్న రోజుల్లో భారతదేశాన్ని మరింతగా ఉన్నత శిఖరాలవైపు తీసుకెళ్లడానికి ప్రవాస భారతీయులు సహకారం మరింతగా అవసరం అవుతుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలకు చేరుకోవడానికి ప్రవాస భారతీయుల సాయం మరింతగా అవసరం అవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే కొత్త ఏడాది ప్రారంభంలోనే వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ మూలాలు మరువకుండా మాతృదేశానికి రావడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు ఆయన.
ఈ సందర్భంగా ఈనెలలో రానున్న పండుగలను ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా, సంక్రాంతి పర్వదినాల గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటువంటి పండుగల సీజన్‌లో ప్రవాస భారతీయులు వేడుకలు జరగడం ఆనందించదగ్గ విషయమన్నారు.ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జయ శంకర్, ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు.