ఫామ్‌హౌస్‌లో వీకెండ్ గెట్ టుగెదర్ పార్టీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం జరిగింది. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన గండ్లరాముగా గుర్తించారు. రాము హైదరాబాద్ రామాంతపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 15 మంది తోటి ఉద్యోగులు, టీమ్ లీడర్ కలిసి ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ చేసుకుంటున్నారు. శనివారం సాయంత్రం మొదలైన పార్టీ ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అర్ధరాత్రి తర్వాత రాము స్విమ్మింగ్‌పూల్‌లో స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఉద్యోగులు రామును వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాము మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడి ఒంటిపై గాయాలను గుర్తించారు. పార్టీ చేసుకున్న ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కష్టంగా మారిందని పోలీసులు అంటున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పార్టీలో పాల్గొన్న ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు.


