– తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి ఎంపిక
– తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా రికార్డు
– తెలుగు అధికారులకు అవకాశం ఇవ్వడం లేదన్న విమర్శలకు తెరదింపిన కేసీఆర్
– తొలిసారిగా తెలుగు అధికారికి సీఎస్ అవకాశం
– ఇప్పటిదాకా నీలం సహానీ ఏపీ తొలి మహిళా సీఎస్‌గా చరిత్ర
– శాంతికుమారి కృష్ణా జిల్లా వాసి
-సీఎస్‌గా రామకృష్ణారావుకు దక్కని అవకాశం
– ఇప్పటికే బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కాపు నేత తోట
– తాజా నియామకంతో తెలంగాణలో మున్నూరుకాపులను ఆకర్షించే నిర్ణయం
– అటు ఆంధ్రాకాపు-తెలంగాణ మున్నూరుకాపులను మెప్పించే ద్విముఖ వ్యూహం
– రెండు రాష్ట్రాల్లో ఆంధ్రులకు బీఆర్‌ఎస్ శుభవార్త
– శాంతికుమారి సహా కేసీఆర్‌ను కలసిన కాపు నేతలు
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఒక్క నిర్ణయం. రాజకీయంగా ఎన్నో లాభాలు. ఆంధ్రులు- కాపులపై తెలంగాణ సీఎం-బీఆర్‌ఎస్ అధిపతి కేసీఆర్ ‘జమిలి మంత్రం’ సంధించారు. కాపు సామాజికవర్గాన్ని గంపగుత్తగా.. బీఆర్‌ఎస్ వైపు మళ్లించే వ్యూహాలను కేసీఆర్ విజయవంతంగా అమలుచేస్తున్నట్లు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రా మూలాలు ఉన్న, కాపు సామాజికవర్గానికి చెందిన శాంతికుమారిని సీఎస్‌గా నియమిస్తూ.. తీసుకున్న నిర్ణయం, బీఆర్‌ఎస్ భవిష్యత్తు వ్యూహమేమిటన్నది స్పష్టం చేసింది. కృష్ణా జిల్లాకు చెందిన శాంతికుమారిని, ఊహించని విధంగా సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, అధికార వర్గాలను విస్మయపరిచింది. ఆ వెంటనే ఏపీ కాపు ప్రముఖులంతా శాంతికుమారితో కలసి, కేసీఆర్‌ను కలవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణ సీఎస్ రేసులో తనకు సన్నిహితులైన అధికారులు పలువురు ఉన్నప్పటికీ.. వారిని కాదని ఏపీ కాపు సామాజికవర్గానికి చెందిన, శాంతికుమారిని నియమించడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. రామకృష్ణారావుకు సీఎస్ పగ్గాలు ఇస్తారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే కాపు వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను, ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్.. తాజాగా అదే సామాజికవర్గానికి చెందిన శాంతికుమారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీనితో కేసీఆర్.. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర ప్రజలతోపాటు.. రెండు రాష్ట్రాల్లోని కాపు-మున్నూరు కాపులను ఆకర్షించే రాజకీయ ఎత్తుగడకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది.
దానితోపాటు.. ఇప్పటివరకూ తెలుగు అధికారులకు సీఎస్ పదవులు ఇవ్వడం లేదన్న విమర్శలు కేసీఆర్‌పై వినిపిస్తున్నాయి. తాజాగా శాంతికుమారి నియామకంతో, కేసీఆర్ ఆ విమర్శలకు తెరదింపినట్టయింది.
టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన తర్వాత, ఏపీ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్, ఆ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో 24 శాతం ఉన్న కాపు-బలిజ-ఒంటరి కులాలు జనసేన వైపు చూస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ క్రమంలో అదే కాపు వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను.. ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్, జనసేనకు ఝలక్ ఇచ్చారు. అదే వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ పార్ధసారధికి సైతం బీఆర్‌ఎస్ కండువా కప్పారు. దానితో ఆంధ్రా కాపులను ఆకట్టుకునేందుకు, కేసీఆర్ వ్యూహరచన చేస్తున్న విషయం స్పష్టమయింది.
దానికి కొనసాగింపుగా… కృష్ణా జిల్లా కాపు వర్గానికి చెందిన శాంతికుమారిని తెలంగాణ సీఎస్‌గా నియమించి, కాపుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. శాంతికుమారి నియామకంతో.. అటు ఆంధ్రాలో కాపులు-ఇటు తెలంగాణలో మున్నూరు కాపులను, గంపగుత్తగా బీఆర్‌ఎస్ వైపు మళ్లించే ఎత్తుగడగా స్పష్టమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న కాపులు-తెలంగాణలోని మున్నూరు కాపుల ఓట్లను, జమిలిగా సాధించడమే కేసీఆర్ లక్ష్యంగా ఈ నియామకాలు స్పష్టం చేస్తున్నాయి.
శాంతికుమారి నియామకం తర్వాత.. కాపు వర్గంలో పేరు ప్రతిష్ఠలు ఉన్న తమిళనాడు మాజీ సీఎస్ ఆర్. రామ్మోహన్‌రావు, బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ , పార్ధసారధి.. సీఎస్ శాంతికుమారితో కలసి ప్రగతిభవన్‌కు వెళ్లి, సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కాపు వర్గానికి చెందిన శాంతికుమారికి సీఎస్ పదవి ఇచ్చినందుకు వారంతా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్‌ను వీరంతా కలసిన వీడియోలు, ఫొటోలను బీఆర్‌ఎస్ అధికారికంగా విడుదల చేయడం కూడా, వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది. కాపులంతా కేసీఆర్‌కు మద్దతునిస్తున్నారన్న సంకేతాలు ఆ వర్గానికి ఇచ్చేందుకే.. వారు కలసిన వీడియోలు విడుదల చేసినట్లు, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.