Greater Noida auto expo 2023 starts :
వావ్, ఊహించడానికే వీలుకాని పరిస్థితి, నమ్మశక్యం కాని నిజం ఇది, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 700 కిమీ వెళ్లిపోవచ్చు. అంటే సికింద్రాబాద్ లో ఉదయం ఛార్జింగ్ పెట్టుకుని విశాఖపట్నం వరకు ఆగకుండా వెళ్లిపోవచ్చు. పెట్రోలు గొడవే లేదు. కనీవినీ ఎరుగని రీతిలో కొత్తకొత్త వాహనాలు ‘గ్రేటర్ నోయిడా ఆటో ఎక్స్ పో 2023’ లో కొలువు తీరాయి.

ఇవన్నీ సరికొత్త విద్యుత్ వాహనాలని ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇప్పటికే పలు మోడళ్లు ఆదరణ పొందుతున్నాయి. వీటిని మరింత ఆధునికీకరించి, మళ్లీ వాటికి అదనపు హంగులు చేర్చి, ప్రమాదరహితంగా మార్చి ఆటో ఎక్స్ పో 2023 కి తీసుకువచ్చారు. కరోనా అనంతరం మూడేళ్ల తర్వాత ‘గ్రేటర్ నోయిడా’లో ఆటోఎక్స్ పో ఏర్పాటైంది. చూడముచ్చటైన మోడళ్లతో కొత్త కొత్త సవాళ్లను ఛేదించి భారతీయ రహదారులపై పరుగులు తీసేందుకు ఇవి ఉవ్విళ్లూరుతున్నాయి.

సుజుకి మోటార్ బ్రాండ్ తో ఎస్ యూవీ ఇవీఎక్స్ నూతన ఆవిష్కరణతో తొలిరోజు ప్రారంభమైంది. మొత్తమ్మీద కాన్సెప్ట్ కార్లు, బైక్ లు, ట్రక్కులు, సైకిళ్లు, విద్యుత్ బస్సులు కూడా వచ్చి ‘ఆటోఎక్స్ పో 2023’ లో సందడి చేశాయి.

ఇందులో మరో గొప్ప విశేషం ఏమిటంటే… ‘సోలార్ కారు’…ఇదింకా ట్రయల్ దశలోనే ఉంది. ప్రస్తుతం ముగ్గురితో నడిచే విధంగా తయారవుతున్న కారు భవిష్యత్తులో ఎన్ని రూపాంతరాలు చెందుతుందోనని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఎలక్టిక్ స్కూటీలు, బైక్స్
హ్యుందాయ్ అయానిక్ 5: రూ.44.95 లక్షల (షోరూం ధర)తో పూర్తిస్థాయి విద్యుత్ మోడల్ అయిన అయానిక్ 5ని తీసుకువచ్చింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 631కిమీ వెళ్లవచ్చునని కంపెనీ చెబుతోంది.

కియా మోటార్స్ 2027కల్లా మార్కెట్ లోకి విద్యుత్ వాహనాలకు తీసుకువస్తున్నట్టు తెలిపింది. ఇందుకు రూ.2వేల కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్టు ప్రకటించింది. అయితే శుభవార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్లాంటు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు తగ్గే అవకాశం ఉంది.

2025కల్లా సుజుకి మోటార్స్ ద్వారా మార్కెట్ లోకి వచ్చే ఎస్ యూవీ ఇవీఎక్స్ మోడల్ ను ప్రదర్శనలో పెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 550 కిమీ ప్రయాణించవచ్చునని చెబుతోంది. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల ఉత్పత్తికి రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపింది.

అతుల్ ఆటో ప్రయాణీకుల కోసం ఎలక్ట్రిక్ ఆటో తీసుకువచ్చింది. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే 110 కిమీ వెళుతుంది. 2 బ్యాటరీలతో 195 కిమీ ప్రయాణించే సరకు రవాణా చేసేందుకు ఎనర్జీ మోడళ్లను తీసుకువచ్చింది.

టయోటాకు చెందిన లగ్జోరియస్ కారు లెక్సస్…ఫిఫ్త్ జనరేషన్ ఆర్ఎక్స్ ఎస్ యూవీని రెండు మోడళ్లతో ప్రదర్శనలో ఉంచింది. ఇవి చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు. అయితే ధరను ఇంకా ప్రకటించలేదు. కార్పొరేట్ ప్రపంచంలో వారికి అనువైన కారుగా చెబుతున్నారు.

దేశంలోనే తొలి సోలార్ కారు…తొలిదశలోనే ఉంది. ఇది తయారు కావడానికి మరికొంతకాలం పడుతుంది. అటు సౌరశక్తి, ఇటు ఎలక్ట్రిక్ బ్యాటరీ, అదైపోతే ఇది, ఇదైపోతే అదన్నమాట…అంటే ఎండ కాసేటప్పుడు సోలార్ బ్యాటరీతో రయ్ మని వెళ్లిపోతుంది. ఎండ లేదు వర్షం పడుతుంటే మామూలు ఎలక్ట్రిక్ బ్యాటరీతో ఝుంమ్మని వెళ్లిపోతుందన్నమాట. కాన్సెప్ట్ దశలో ఉన్న ఈ కారు వచ్చే ఏడాదికల్లా మార్కెట్ లోకి వస్తుంది. ఇందులో ముగ్గురే ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో నలుగురితో వెళ్లేది వచ్చేస్తుందని కొందరు వ్యాక్యానిస్తున్నారు.

ఇంకా చైనా విద్యుత్ తయారీ కంపెనీ బీవైడీ, సియోరా ఈవీ కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్లను విపణిలో ప్రవేశపెట్టారు. ఇవి ఒకసారి ఛార్జింగ్ పెడితే 700 కిమీ వెళ్లిపోవచ్చని చెబుతోంది. చైనా వాళ్ల సంగతి తెలిసిందే కదా…అన్నీ స్పీడుగానే ఉంటారు. ఆఖరికి మహమ్మారి విషయంలో కూడా అంతే స్పీడ్ గా ఉన్నారని కొందరు వ్యాక్యానిస్తున్నారు. రాబోవు రోజుల్లో అంటే 2030 కల్లా ఈ ఎలక్ట్రిక్ కార్లలోనే 50శాతం పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయనే వ్యాక్యానాలు వినిపిస్తున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తే, పెట్రోలు తగ్గిపోయే ప్రమాదం ఉందని కొందరు జోక్ చేస్తున్నారు. రాబోవు రోజుల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలు రోడ్లపై ఉండకపోవచ్చునని కూడా అంటున్నారు. అప్పుడు పవర్ షార్టేజ్ వస్తుందని, మళ్లీ కార్లన్నీ సోలార్ వైపు వెళతాయని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.