దక్షిణ కాశీగా పేరు గాంచిన సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన తెల్లవారు జామునుంచే భక్తులు బారులు తీరతారు. అమృత గుండంలో స్నానాలు ఆచరించి, గర్భగుడిలోని శివలింగానికి అభిషేకం చేశారు. పార్వతి సమేత సంగమేశ్వరుని దర్శించుకుని భక్తులు పునీతులు అవుతారు. ఈ ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ల నుండి భక్తులు భారీగా తరలి వస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు చలువ పందిరి వేసి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పోలీసులు బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని, ఆలయ పరిసరాలను మొత్తం రంగులతో ముస్తాబు చేశారు.రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయం మొత్తం అలంకరించారు. శివరాత్రి కి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ కమిటీవారు విజ్ఞప్తి చేసారు. మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 11గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.
ములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాజరాజేశ్వర స్వామికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు విజయవంతం కావాలని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషంతో సుభిక్షంగా ఉండాలని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. వేములవాడ ఏరియా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నందున శాశ్వత కమిటీ వేయలేకపోయినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో జాతర ఉత్సవ కమిటీని వేశామన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ ఐదో శక్తి పీఠంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఉదయం 5.30 నుంచి స్వామి వారికి అభిషేకములు, రాత్రి లింగోద్భవ సమయములో యమ పూజలు, శివ స్వాములచే ఆకాశ దీప ప్రజ్వలనము, రాత్రి 2 గంటలకు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. మంగళవారం రోజున ఆలయంలో నిర్వహించిన ధ్వజారోహణ, యాగశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుండిశ్రీ స్వామివారికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. దేవరకద్ర మండల కేంద్రం లోని అతి పురాతనమైన శివాలయంలో భావికాడి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించారు . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది . ఉపాధ్యాయ మధ్యాహ్నము గిరిజా కళ్యాణం నిర్వహిస్తున్నామని అలాగే రాత్రికి జాగరణ భజన కార్యక్రమము మరియు మరుసటి రోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు ఆంజనేయులు, నందకిషోర్, జగన్మోహన్ రెడ్డి ,కిరణ్ రెడ్డి తెలిపారు