హైదరాబాద్: కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఎంతోమందికి అండగా నిలిచి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. గతంలో అన్నా హజారే, కిరణ్ బేడీ లాంటి వాళ్లు అందుకున్న ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’ ఈ సారి సోనూసూద్‌ను వరించింది. సోనూసూద్ చేస్తున్న సమాజసేవను గుర్తించిన సంకల్ప్ దివాస్ వ్యవస్థాపకుడు లయన్ కిరణ్.. ఆయనను పురస్కారంతో గౌరవించి సత్కరించారు. ఈ వేడుకకు భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సోనూసూద్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం పొందటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని, తాను పంజాబీ అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపిస్తుంటారని, అందుకే తాను తెలుగువారిని కుటుంబసభ్యుల్లా భావిస్తానని చెప్పారు. మనం ఎంత సంపాదించం అనే దానికంటే, మనం సమాజానికి ఏం చేశాం అనేదే ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని లాక్ డౌన్ సమయంలో గ్రహించానని చెప్పారు.