వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. అబద్ధాలను అందంగా అల్లడంలో జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని విమర్శించారు.
ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే.. అమెరికా దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే… అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలన్నారు. మాజీ సీఎం జగన్ ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు షర్మిల.