టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ సీఎంవో కార్యాలయానికి రావాలంటూ ఇద్దరు నేతలకు ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులుగా కడప జిల్లాలో ఇద్దరి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం నడుస్తోంది. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్… ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం తలెత్తింది. రెండు రోజులుగా ఇరు వర్గల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. RTPP దగ్గర, అనంతపురం, కడప జిల్లాల సరిహద్దులో పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చి ఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. జేసీ వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో RTPP దగ్గర లారీలు నిలిచి పోయాయి. కాగా.. ప్లైయాష్ లోడు లేకుండా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్లు అంటున్నారు.
కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి.. ఇద్దరూ కూటమి నేతలే కావడం విశేషం. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి చెందిన టీడీపీ నాయకుడు, ఆదినారాయణరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. వీళ్లిద్దరి మధ్య ప్లైయాష్ రవాణాకు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోకి ఆర్టీపీపీ ఉంది. దీంతో తమ నియోజకవర్గంలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని ఆదినారాయణరెడ్డి భావిస్తున్నారు. కానీ ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమలకు జేసీ ప్రభాకర్ వర్గీయులు ప్లైయాష్ తరలిస్తున్నారు. దీంతో…. తమ నియోజవర్గం నుంచి బూడిదను తలించేందుకు అనుమతించేది లేదంటూ… ఆదినారాయణ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించవద్దంటూ మందలించేందుకే చంద్రబాబు ఇరువురు నేతల్ని పిలిచినట్లు తెలుస్తోంది.