1.. పెట్రోల్, డీజిల్ ను పరిమితంగా వినియోగించండి
2..ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి
3..దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఆడంబరాలకు పోవద్దు
4..విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి
5..ఏడాది పాటు బంగారం కొనకుండా శపథం చేయాలి
6..వంట నూనె వాడకం తగ్గించుకోవాలి
7..ఎరువులు, రసాయనాలు వినియోగం సగానికి సగం తగ్గించండి
8..ఆన్ లైన్ మీటింగ్ లు, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఏర్పాట్లు చేసుకోండి
9…గుండు సూది నుంచి ప్రతిదీ విదేశీ వస్తువులు కొనొద్దు
ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను ప్రజలు నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. మధ్య తరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఆడంబరాలకు పోవద్దని అన్నారు. మధ్యతరగతి ప్రజలు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందని.. గతంలో యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు బంగారం దానం చేసేవారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించుకోవాలన్న మోదీ.. ప్రజా రవాణాలను వినియోగించుకోవాలని చెప్పారు.
కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యుద్ధాల కారణంగా చమురు ధరలు పెరిగాయని, అయితే ఆ భారాన్ని భారత ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, అవసరమైతే ఏడాది పాటు కొనుగోళ్లు నిలిపివేయాలని సూచించారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ వివాహాలు వంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
చమురు వినియోగంపై ఆధారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ సమస్యలను ఇతర దేశాలతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యమని, అందుకోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. రైల్వే రంగంలో కూడా డీజిల్ వినియోగాన్ని తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
చమురు వినియోగం తగ్గితే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ఆయన అన్నారు. అలాగే బంగారం దిగుమతులు తగ్గితే ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని వివరించారు.
దేశంలో వంటనూనె దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అలాగే ఎరువుల వినియోగాన్ని సమతుల్యంగా చేసుకోవాలని, భూసారాన్ని పెంచాలని సూచించారు. యూరియా ధరల విషయంలో భారత్‌లో రైతులకు భారీ సబ్సిడీ అందుతోందని, ఇతర దేశాల్లో యూరియా బస్తా ధరలు వేల రూపాయల్లో ఉండగా భారత్‌లో మాత్రం తక్కువ ధరకే అందిస్తున్నామని చెప్పారు.
నిత్యావసరాల్లో స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. “స్వదేశీ” కేవలం రాజకీయ నినాదం కాదని, అది దేశ ఆర్థిక విధానంలో భాగమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


