స్వతంత్ర వెబ్ డెస్క్: ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో హింస ఆగడంలేదు. తాజాగా బుధవారం తెల్లవారు జామున భారీగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఇప్పటి వరకు ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. మంగళవారం రాత్రి తొలి ఘటన ఖోయిజుంతాబి ప్రాంతంలో చోటు చేసుకొంది. మరో ఘటన బుధవారం తెల్లవారు జామున 4.30 సమయంలో తూర్పు ఫైలెంగ్ ప్రాంతంలో జరిగింది. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదు.
ఇక మరోవైపు.. రాష్ట్రంలోని ఇండియన్ రిజర్వు బెటాలియన్ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. వీటిని భద్రతా దళాలు అడ్డుకొన్నాయి. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని ధౌబాల్ జిల్లాలో చోటు చేసుకొంది. ఇక్కడ వందల సంఖ్యలో అల్లరి మూకలు ఐఆర్‌బీ బెటాలియన్ పోస్టుపై దాడి చేశాయి. ఐఆర్‌బీ దళాలకు మద్దతుగా సైన్యం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇతర దళాలు రాకుండా అల్లరి మూకలు రహదారులను ముందే తవ్వేశాయి. కానీ, అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ముప్పు తప్పింది. వీరు అల్లరిమూకలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. మణిపుర్‌లోని చాలా పోస్టుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 326 మందిని అరెస్టు చేశారు.