స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. హస్తినలో ఆయన వరుస సమావేశాలతో బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు.
ఈ పర్యటనలో ప్రధానంగా ఏపీకి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. ఈ నెల 6న ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి వస్తారు. ప్రధానితో భేటీలో మరికొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులకు వైఎఎస్సార్‌సీపీ మద్దతు కోరే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి మద్దతు కావాల్సి అనివార్యం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది.