ఆయన అధికార పార్టీకి చెందిన ఎంపీ. సర్కారు అండదండలతో తాను ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఆయన. నెల్లూరు జిల్లాలోని విలువైన ఖనిజాన్ని విదేశాలకు తరలించేందుకు అన్ని మార్గాల్ని ఆయనకు అణువుగా మార్చుకున్నారు. ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇందుకు గనుల శాఖ అధికారి కూడా వంత పాడడంతో వేమిరెడ్డి మైనింగ్ దందాకు నెల్లూరు జిల్లాలో అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న మాట విన్పిస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్ను నెల్లూరు జిల్లాలో ఉన్న సైదాపురం క్వార్ట్జ్‌పై పడిందన్న వాదన విన్పిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే క్వార్ట్జ్‌కు బహిరంగ మార్కెట్‌లో మంచి విలువ ఉందని తెలుసుకున్నారట ఎంపీ. అంతే.. అధికారుల అండతో వాటిని తవ్వి తీసే పథకం రూపొందించారట వేమిరెడ్డి.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ క్వార్ట్జ్ ఖనిజాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో.. కొన్ని రోజుల కిందటి వరకు టన్ను మూడు వేలు ఉన్న ఆ ఖనిజం ధర ఇప్పుడు దేశీయంగా 20 వేలకు పెరిగింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో 40 నుంచి 60 వేలకు విక్రయిస్తున్నారు.
క్వార్ట్జ్ ఖనిజానికి భారీ డిమాండ్ ఉండడంతో అధికారం అండగా వేమిరెడ్డి రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా తనకు అనుకూలమైన వ్యక్తికే బాధ్యతలు అప్పగించేలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. ఇక, ఇక్కడి నుంచి కథ మొత్తం మారిపోయిందట. సదరు అధికారి ద్వారా మైనింగ్ కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇప్పించారన్న టాక్ నడుస్తోంది.
మైనింగ్ ఎంత చేసినా, ఎలా చేసినా ఇబ్బంది లేదని.. లభించిన మైకా మిక్సింగ్ క్వార్ట్జ్‌ను మాత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికే ఇవ్వాలని అంతర్గతంగా ఆర్డర్స్ వెళ్లాయంటున్నారు కొందరు. మాట వినకపోతే అక్రమ మైనింగ్ పేరుతో లీజు రద్దు చేస్తామన్న బెదిరింపులు సైతం ఆ అధికారి ద్వారా వెళ్లాయట.
వాస్తవానికి..నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు ఎంపీ వేమిరెడ్డి. అప్పట్లో ఇదంతా జిల్లాపై ప్రేమ అని అంతా భావించారని.. కానీ, తన దందా నడిపించడం కోసమేనన్నది ఇప్పుడు అర్థం అవుతోందని అంటున్నారు కొందరు స్థానికులు. పైగా కూటమి ఎంపీ కావడంతో ప్రభుత్వ సహకారం సైతం ఉండే ఉంటుందని చర్చించుకుంటున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు.