Andhra Pradesh: వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. డీపీటీ విధానాన్ని జగన్ అవలంభిస్తున్నారన్నారు. దోచుకో.. పంచుకో.. తిను అనే విధానాన్ని ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. కొంతమంది అక్రమాలకు అడ్డువస్తున్నాననే ఉద్దేశంతోనే తనపై ఓ ముద్ర వేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఓ కుక్కను చంపితే జంతు వధ కింద శిక్ష పడుతుందని, అదే పిచ్చికుక్క అనే ముద్ర వేస్తే శిక్ష ఉండదని.. ఈక్రమంలో తనపై పిచ్చి కుక్క అనే ముద్ర వేశారన్నారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. తాను ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను నాలుగేళ్లుగా బానిస సంకేళ్ల కింద ఉన్నానని, ప్రస్తుతం బానిస సంకేళ్ల నుంచి విముక్తి లభించిందన్నారు. గతంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రజల్లోనే ఉంటానని, అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తానన్నారు.
తాను ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేనని, నియోజకవర్గ ప్రజలకు తన వంతు సాయం చేస్తానని, ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. వైసీపీకి చెందిన కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఓటుకు నోటు ముద్ర వేశారన్నారు. రహస్య ఓటింగ్ విధానంలో తాను ఎవరికి ఓటు వేశానో ఎలా తెలుస్తుందన్నారు. తాను వైద్య వృత్తిలో ఉంటే అవసరమైనంత డబ్బులు సంపాదించుకోవచ్చన్నారు.
ఓటుకు నోటు తీసుకునేంత స్థాయికి తాను దిగజారలేదన్నారు. తనకు ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ప్రాణహని ఉందని తెలిపారు. వైసీపీకి, సీఎం జగన్ కు త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న ఉండవల్లి శ్రీదేవి.. ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నానని.. ఏపార్టీలో చేరే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తానంటూ ఆమె హామీ ఇచ్చారు.