మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. లాయర్లను తనతో పాటు అనుమతించకపోవడంతో విచారణకు హాజరుకాకుండానే వెళ్లిపోయారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వకంగా కేటీఆర్ వివరణ ఇచ్చారు. లాయర్లను అనుమతి ఇస్తేనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. తనతో పాటు లాయర్లను అనుమతించకపోవడంతో వెనుదిరిగారు కేటీఆర్. అక్కడి నుంచి ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారని అన్నారు. చట్టాలను గౌరవించి, రాజ్యాంగంపై ఉన్న నమ్మకంతోనే విచారణకు వచ్చానని చెప్పారు. తనను ఏసీబీ విచారణకు పిలిచి తన ఇంటిపై రెయిడ్స్ చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. నా ఇంట్లో వాళ్లే ఏదో ఒకటి పెట్టి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారన్నారు.
రైతు భరోసా నుంచి డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే ఏసీబీ విచారణకు వచ్చా. లాయర్‌ను అనుమతిస్తేనే విచారణకు వస్తా. నరేందర్ రెడ్డి విషయంలో కుట్ర చేశారు. పోలీసులు దొంగ స్టేట్‌మెంట్ సృష్టించారు. నరేందర్ రెడ్డికి జరిగిందే నాకూ జరుగుతుంది. హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండగా ఈ డ్రామాలు ఎందుకు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలను నా ఇంట్లో పెట్టి.. నన్ను ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్ములా ఈ వ్యవహారంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. సమాచారం అంతా ఏసీబీ దగ్గరే ఉంది. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. నేను చెప్పనిది చెప్పినట్టు రాసుకోవడానికే లాయర్‌ను వద్దంటున్నారు. అడ్వకేట్‌ను అనుమతించకపోతే వెనక్కి వెళ్లిపోతా. డ్రామాలతో డైవర్షన్ తప్ప మరొకటి లేదు. 420 హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంతో కొట్లాడతాం… అని కేటీఆర్ అన్నారు.
ఫార్ములా ఈ రేసు కేసులో దర్యాప్తునకు రావాలంటూ ఈనెల 2న ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. డిసెంబర్ 20, 31న హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం..తమ ముందు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. జనవరి 6న ఉదయం 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈనెల 3న నోటీసులు అందుకున్నట్లు కేటీఆర్ సంతకాలు చేశారు.
కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా BRS నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే 100 మంది బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. బీఆర్‌ఎస్వీ నేత మేకల విద్యాసాగర్ ను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.