ఆంధ్రప్రదేశ్: ఎన్టీఆర్ జిల్లాలో ముంబై పిల్లల కిడ్నాప్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మగ పిల్లలే టార్గెట్‌గా ఓ ముఠా చేస్తున్న ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మగ పిల్లలను ఈ ముఠా ఎన్టీఆర్ జిల్లాలో అమ్మేశారు. నలుగురు జగ్గయ్యపేటలో, ఒకరిని విస్సన్నపేటలో అమ్మేసినట్లు సమాచారం. ఈ ముఠాపై దృష్టి సారించిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఇద్దరు పిల్లలు దొరికారని.. మరో ముగ్గురు పిల్లల కోసం తనిఖీలు చేస్తున్నామని వారు తెలిపారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లా పాలెంలో మొత్తం 8 మంది పిల్లలను ఈ ముఠా కిడ్నాప్ చేసిందని.. పిల్లల అమ్మకంలో కీలక పాత్ర పోషించిన బెజవాడకు చెందిన శ్రావణిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.