మంచు ఫ్యామిలీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మంచు మనోజ్ చెబుతుందంతా అబద్ధమంటూ ఆయన తల్లి నిర్మల లేఖ రాయడంతో ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏర్పడింది. ఇంట్లో విష్ణు ఎలాంటి గొడవ చేయలేదంటూ ఆమె వివరణ ఇచ్చారు. మోహన్‌బాబు కుటుంబ వివాదంపై తొలిసారి స్పందించారు ఆయన భార్య నిర్మల. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
డిసెంబర్ 14న తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్‌పల్లిలోని ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని చెప్పారామె. అయితే ఈ విషయంపై మంచు మనోజ్.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదని ఆమె ఈ లేఖలో తెలిపారు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయాడని చెప్పారు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో.. పెద్ద కుమారుడు విష్ణుకీ అంతే హక్కు ఉందన్నారామె. తన పుట్టినరోజు నాడు విష్ణు మనుషులతో ఇంట్లోకి రాలేదని… మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు పని మానేయడంలో విష్ణు ప్రమేయం లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.