పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ దేశాన్నే ఉర్రూతలూగించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంచనలనంగా మారింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జునే కారణమంటూ పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మరోపక్క ఈ వ్యవహారం పొలిటికల్ దుమారం రేపుతోంది. అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని.. సీఎం రేవంత్ ఆగ్రహం కారణమన్న టాక్ వినిపిస్తోంది. మరి అర్జున్ అరెస్ట్ కు తొక్కిసలాటే కారణమా..? లేదంటే అభిమానులు ఊహిస్తున్నట్టు కుట్ర కోణం దాగి ఉందా..?
నేషనల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వార్ గత మూడు, నాలుగు రోజులుగా ప్రకంపనలు రేపింది. ఆ ఘటన అలా ముగిసిందో లేదో.. అల్లు అర్జున్ అరెస్ట్ టాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై BNS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా.. తాజాగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అంతకు ముందు బన్నీని అరెస్ట్ చేసి నేరుగా చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు తన అరెస్ట్ సందర్భంగా పోలీసుల తీరుపై మండిపడ్డారు బన్నీ. తన నివాసంలోకి అకస్మాత్తుగా పోలీసులు వచ్చారని తెలిపారు. డైరెక్ట్‌గా తన బెడ్ రూమ్ లోకి వచ్చారని,.. ఆ సమయంలో దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్ట్ బెడ్ రూమ్‌లోకి పోలీసులు వచ్చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు తనను తీసుకెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అప్పటికప్పుడు రావాలని చెబితే ఎలా అని అల్లు అర్జున్ నిలదీశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే సినిమా షూటింగ్ రద్దు చేసుకుని.. తన భార్యతో కలిసి బన్నీ ఇంటికి చేరుకున్నారు చిరంజీవి దంపతులు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఇంటికి చేరుకుని అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. ఇక అల్లు అర్జున్ అరెస్టుపై తనదైన శైలిలో స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, కలిసుంటే నిలబడతాం.. విడిపోతే పడిపోతామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి అల్లు వర్సెస్ మెగా పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే పవన్ ఆసక్తికర ట్వీట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
ఇకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆగ్రహమే కారణమన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పుష్ప 2 సక్సెస్ మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతో.. అల్లు అర్జున్ పై కోపంతోనే సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసును రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారని.. అందుకే అరెస్ట్ చేయించారని ఆరోపిస్తున్నారు బన్నీ అభిమానులు. అయితే.. ఇందులో నా జోక్యమేమీ లేదని అరెస్ట్‌పై స్పందించారు సీఎం రేవంత్‌రెడ్డి. చట్టం ముందు అందరూ సమానమేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తొక్కిసలాట ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్‌ను పలువురు సినీ ప్రముఖులే కాదు.. ప్రతిపక్ష నేతలు ఖండిస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ సర్కార్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనమని విమర్శించారు. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. కానీ, ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదు. బన్ని అరెస్టు తీరును ఖండిస్తున్నా. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్టు చేశారు. ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలి. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారని ట్వీట్ చేశారు. అభద్రతాభావం కలిగిన నాయకుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు అంటూ ఓ కొటేషన్‌ను కేటీఆర్ పోస్ట్‌తో పంచుకున్నారు.
ఇటు బీజేపీ నేతలు కూడా బన్నీ అరెస్ట్‌పై ఫైర్ అవుతున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని.. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు కేంద్రమంత్రి బండిసంజయ్. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా బెడ్ రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవ పరిచారని ఆరోపించారు. ఇంతటి హైప్రొఫైల్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే అసలైన వైఫల్యమన్న ఆయన.. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని.. ఐకాన్ స్టార్, అతని అభిమానులు గౌరవం, క్రమశిక్షణకు మారుపేరని వారిని నేరస్థులుగా చూడొద్దని ట్వీట్ చేశారు.
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ వేళ.. ఏపీ సీఎం చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలని పలు ప్రత్యర్థి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 2015, జూలై 14న రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లా కందుకూరు, ఉయ్యూరు తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి కదా ప్రజాశాంతి అధ్యక్షుడు KA పాల్, లక్ష్మీ పార్వతి కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే,.. అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఓ లేఖను బయటపెట్టింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని.. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఓ లేఖను షేర్ చేసింది. డిసెంబర్ 04న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అల్లు అర్జున్, హీరోయిన్, వీఐపీలు వస్తున్నారు. భారీగా ప్రజలు తరలివస్తార కాబట్టి పోలీసులు బందోబస్తు కల్పించండని ఏసీపీకి లేఖను రాసినట్టు లేఖ విడుదల చేశారు.