రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. దీని వెనుక రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్‌లో గ్రామ సభ ఏర్పాటు చేయాలని సవాల్ చేశారు. హామీల అమలుపై గ్రామసభలోనే చర్చిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలను, రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులకు పోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.