బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తప్పులతడకగా ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ 80 వేల పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి ధరణి పోర్టల్ రూపొందించారని అనుకునేవాళ్లమని తెలిపారు. అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో 1971లో చేసిన చట్టం.. 49 ఏళ్లుగా ప్రజల్లో ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు భూ భారతి బిల్లును ఆమోదించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సూచనలు చేస్తారని ఆశించామన్నారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా BRS సభ్యులు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చిల్లర వేషాలను ప్రజలు హర్షించరని మంత్రి పొంగులేటి అన్నారు.