రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా విధివిధానాలపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతు పథకాన్ని తెచ్చారని… సాగులో లేని భూములకూ రైతుబంధు ఇచ్చారని వివరించారు. దీని ద్వారా 22వేల 600 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూర్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ ఇచ్చారని… రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా..? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రైతు భరోసా అమలు చేయడానికి సభ్యులంతా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు.