లైంగిక వేధింపుల ఆరోపణలతో కస్టడీ విచారణను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను నేడు మూడవ రోజు పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే రెండ్రోజులపాటు విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. ఔట్ డోర్ షూటింగ్స్ సమయంలో జరిగిన లైంగిక దాడులపై ఆరా తీశారు. ఔట్ డోర్ షూటింగ్స్ సమయంలో తనపై లైంగిక దాడి చేశాడని డ్యాన్సర్ ఫిర్యాదులో పేర్కొనడంతో.. ఔట్ డోర్ షూటింగ్ సమయంలో ఏం జరిగింది అనే కోణంలో జానీ మాస్టర్‌ను ప్రశ్నించారు. ఇక ఇవాళ మూడవ రోజు కూడా ఎంక్వైరీ సాగనుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలకు సంబంధించి జానీ మాస్టర్‌ను మరింత లోతుగా విచారించనున్నారు పోలీసులు.
మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ సాగిస్తున్నారు. జానీ మాస్టర్‌ను విచారించే క్రమంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ ప్రచారం జరగడంతో.. థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని, లాయర్ సమక్షంలోనే విచారణ నిర్వహించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో గత రెండ్రోజులుగా న్యాయవాది సమక్షంలోనే పోలీసులు జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు.