మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం కన్నా బెంగళూరులో ఉండడానికే ఆయన ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఏవైనా రాజకీయ కార్యక్రమాలు ఉంటే తప్ప మిగిలిన సమయం అంతా బెంగళూరులోనే గడుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి ఇదే పరిస్థితి. బడ్జెట్ సమావేశాల ముందు బెంగళూరు నుంచి వచ్చిన జగన్.. రెండు రోజులు మాత్రమే ఉన్నారు. మళ్లీ మూడో రోజు మధ్యాహ్నమే బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు. ఈ పర్యటనలో కూడా ఆయన తాడేపల్లిలో ఉన్నది కేవలం రెండే రోజులు.
ఆ రెండు రోజుల్లో ఒక రోజు ఏపీ వార్షిక బడ్జెట్‌పై సుదీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కూటమిపై సెటైర్లు వేశారు. నాన్ స్టాప్‌గా రెండు గంటల పాటు మాట్లాడినా.. రాజకీయ వ్యాఖ్యలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబునాయుడు వైసీపీకి చెందిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లుగా మాట్లాడారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఘాటుగానే కౌంటర్లు ఇచ్చింది.
ఇక ప్రెస్‌మీట్ చివరిలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ జగన్ చేసిన కామెంట్లు ఏకంగా సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. ఇక తాడేపల్లిలో ఉన్నజగన్ రెండో రోజు .. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకాగా.. జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. మూడో రోజు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండానే.. శుక్రవారం మధ్యాహ్నమే ఆయన బెంగళూరు ఫ్లైట్ ఎక్కేశారు.