వరంగల్: ‘సత్యభామ’ సీరియల్‌లో నటించిన ముఖ్య తారాగణంతో వరంగల్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహించింది. ‘ సత్యభామ’ తారలు తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ నగర ప్రజలతో కలిసి జరుపుకోవడం వల్ల ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఈ తారల వివాహ రెసెప్షన్ వేడుకలు కూడా వరంగల్‌లో జరగ్గా, అప్పుడు ఇక్కడి వారు అపూర్వ స్వాగతం పలికారు.
వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి పవిత్రోత్సవాలను తిలకించారు. ‘ సత్యభామ’ కళాకారులు వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హాజరైన మహిళలకు వాయనాలు అందించటంతో పాటుగా ప్రసాదాలు పంపిణీ చేశారు.
అభిమానులు తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటూ కళాకారులను బహుమతులతో ముంచెత్తారు. ఈ షోతో తమకున్న లోతైన బంధాన్ని మరింతగా వెల్లడించారు. ఈ సీరియల్ హీరో క్రిష్ ప్రేక్షకులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమం హుషారుగా జరిగింది. అసలైన తెలుగు శైలిలో పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఆన్-స్క్రీన్ జంట వేదికపై సజీవ నృత్యం చేయడంతో ఉత్సాహం రెట్టింపైంది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సంపదను జోడిస్తూ, ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శన జరిగింది. పురాతన కళను నేటి తరానికి ప్రదర్శిస్తూ జరిపిన ఈ తోలుబొమ్మలాట, తెలుగు ప్రజల సంప్రదాయాలకు ఒక అందమైన నివాళిగా నిలిచింది.