ఐసీసీ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గొంగడి త్రిష బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరో క్రికెటర్ ధ్రుతి కేసరికి రూ.10 లక్షలు ప్రకటించారు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిష అదరగొట్టింది. టీమ్‌ఇండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.
మలేషియాలో జరిగిన మెగా టోర్నమెంట్‌లో ఫైనల్లో సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది భారత్. ఈ విజయంలో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. త్రిష అద్భుత బ్యాటింగ్‌తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శన క్రికెడ్ అభిమానులను ఆకట్టుకుంది. ఫైనల్లోనూ 44 పరుగులు చేసి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.
టోర్నమెంట్ మొత్తం ఆమె 77.25 సగటుతో 309 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రకటించిన టోర్నమెంట్ బెస్ట్ టీమ్‌లో గొంగడి త్రిషతో పాటు నలుగురు భారత క్రీడాకారిణులు స్థానం సంపాదించారు.
త్రిషకు మిథాలీ రాజ్ అంటే అభిమానం. వరల్డ్ కప్‌లో ఓపెనర్ పాత్రకు సంపూర్ణ న్యాయం చేసింది. గత ఎడిషన్‌లో కప్పు నెగ్గిన జట్టులో ఉన్నప్పటికీ త్రిషకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయితే తాజా టోర్నీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వంద శాతం కృషి చేశానని త్రిష అంటోంది. మెగా టోర్నీలో తనకు లభించిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశానని… ఈ విషయంలో సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉన్నానని అంటోంది.